చండూరు, నవంబర్ 27 : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చండూరు మండల కేంద్రంలో ఇండ్ల మధ్యలో ఉన్న వైన్ షాపులను ఊరి చివరకు మార్చాలని చండూరు మున్సిపల్ కమిషనర్ మల్లేశంకు స్థానికులు గురువారం వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులోని బస్టాండ్‌కు సమీపంలో గల వైన్స్ వల్ల చుట్టుపక్కల కాలనీవాసులకు చాలా ఇబ్బంది కలుగుతున్నట్లు తెలిపారు. ఇక్కడ స్కూల్ ఉండటం వల్ల పిల్లలు వచ్చిపోయేందుకు ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. కావునా మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి వైన్ షాపును ఊరు చివరకు మార్చాలని కోరారు. లేదంటే అంతా కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, పగిళ్ల పవన్, పగిళ్ల ప్రశాంత్, నాగిళ్ల నరేశ్, బోడ సాయి, కాలనీవాసులు పాల్గొన్నారు.