యాచారం, ఆగస్టు21: ఫార్మాసిటీకి ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సీపీఎం నాయకులు అంజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గురువారం కుర్మిద్ద గ్రామంలో వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2500ల ఎకరాలకు సంబంధించిన భూములను నిషేధిత జాబితానుంచి తొలగించాలని, ఆన్లైన్లో టీజీఐఐసీ పేర్లను తొటగించి రైతుల పేర్లను నమోదు చేయించాలని ఆయన కోరారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వని ప్రతి రైతుకు రైతు భరోసా, రైతుబీమా, పంట రుణాలు వర్తించేలా చూడాలని ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఫార్మాసిటీకి ఇవ్వని భూములను అమ్ముకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ వసతిని కల్పించాలని కోరారు. సింగారం, నందివనపర్తి, తాటిపర్తి గ్రామాలకు చెందిన రక్షిత కౌలుదారులకు చెందిన సర్వే నంబర్ 148నుంచి 243వరకు 1400ల ఎకరాల భూమిని ఎన్నో ఏళ్లుగా దున్నుకొని బతుకుతున్నారని అట్టి భూములను రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు. కుర్మిద్దలో గ్రామానిరకి ఆనుకొని ఉన్న భూములను ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులెదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మడ్డి సురేష్, గోవర్ధన్, సంజీవ, చెన్నయ్య, కుమార్, అంజయ్య, సావిత్రి తదితరులన్నారు.