కుభీర్ : మానవ జీవితం సఫలం, సార్థకతకు భగవన్నామస్మరణ ఒక్కటే ముక్తికి మార్గమని శ్యాం సుందరగిరి బాలయోగి స్వామీజీ ( Balayogi Swamiji ) అన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం విఠలేశ్వరాలయంలో( Vittaleshwar Temple) కొనసాగుతున్న అఖండ హరినామ సప్తహ వేడుకల్లో భగవన్నామ కీర్తన కొనసాగింది.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ నేటి కలియుగంలో మానవుడు శారీరక, సుఖమయ జీవనం కోసం కోట్లు కూడ బెడుతున్నప్పటికీ భగవంతుని సాన్నిధ్యం లేని ధనం నిరర్థకమని అన్నారు. కలికాలం అంటేనే దుర్మార్గమైన కాలం అయినప్పటికీ యజ్ఞ, యాగాదులు, తపస్సులు లాంటి క్రతువులు చేయకపోయినా కేవలం భగవాన్నామ స్మరణ చేయడం ద్వారా మోక్షం పొందవచ్చన్నారు.
సంత్ తుకారాం, జ్ఞానేశ్వర్ మహారాజ్ లాంటి ఎందరో పుణ్యపురుషులు భగవన్నామ నామస్మరణతోనే ముక్తిని పొందారని అభివర్ణించారు. జీవన అంత్య కాలంలో నైనా కనీసం భగవన్నామస్మరణ చేయడం మరువరాదని దీంతో సకల పాపాలు హరిస్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుండి వచ్చిన సాంప్రదాయ వార్ఖరీ బాలల బృందం నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ కీర్తన కార్యక్రమంలో రాందాస్ గురూజీ వాయికర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, స్థానిక సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్, ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటాజీ, గంగాధర్ పటేల్, బచ్చు ప్రసాద్, ప్రముఖ వైద్యుడు సంతోష్ పెండ్కర్, ఉద్యమకారుడు పుప్పాల పీరాజీ, రాజన్న, మాజీ మండల ఉపాధ్యక్షుడు బందెల శంకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.