బలపడుతున్న మత సమీకరణాలు
ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్‌కు అక్టోబరు 27న జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు. మొత్తం 120 స్థానాలకు గాను, నెతన్యాహు కూటమి 53, ప్రతిపక్షం 48 స్థానాలు దక్కించుకోగా, 19 స్థానాలతో అరబ్ పార్టీలు కింగ్ మేకర్లుగా అవతరించాయి.
ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్‌కు అక్టోబరు 27న జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు. మొత్తం 120 స్థానాలకు గాను, నెతన్యాహు కూటమి 53, ప్రతిపక్షం 48 స్థానాలు దక్కించుకోగా, 19 స్థానాలతో అరబ్ పార్టీలు కింగ్ మేకర్లుగా అవతరించాయి. మత, జాతీయ గుర్తింపుల కారణంగా వాటితో కలిసి పనిచేయడానికి ఇంతకాలం వెనుకంజ వేస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌లోని ప్రధాన రాజకీయ కూటములకు, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో వాటి మద్దతును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. లేకపోతే దేశం మరోసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
అక్టోబరు 26న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో.. ఇటీవల కుదిరిన మక్కా త్రైపాక్షిక రక్షణ ఒప్పందంలో భాగస్వాములైన సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ దేశాల ప్రతినిధులు ఇరాన్‌తో ప్రాంతీయ భద్రతపై చర్చలు జరిపారు. మధ్యప్రాచ్యంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య తీవ్రమైన సున్నీషియా మతపరమైన విభేదాల నేపథ్యంలో దశాబ్దాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, యుద్ధం మరింత విస్తరించకుండా అడ్డుకోవాలన్న ఉమ్మడి లక్ష్యం ఈ నాలుగు దేశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ రెండు పరిణామాలు ఒక వాస్తవాన్ని గుర్తుచేస్తున్నాయి. జాతీయ ప్రయోజనాలు నిర్ణయాత్మకంగా మారినప్పుడు, మత, సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి ప్రత్యర్థులతోనూ సయోధ్య దిశగా అడుగులు వేయక తప్పదు.
మతపరమైన గుర్తింపులను రాజకీయ మద్దతు కూడగట్టుకునే సాధనాలుగా, దేశాల మధ్య మిత్రుత్వాలు లేదా శత్రుత్వాలను నిర్ణయించే ప్రాతిపదికలుగా ఉపయోగించినప్పుడు సమస్య తలెత్తుతుంది. సమకాలీన చరిత్రలో ఇటువంటి అనేక ఉదాహరణలను ప్రస్తావించుకోవచ్చు. ఇజ్రాయెల్పాలస్తీనా వివాదం ఇప్పటికే భారీ ప్రాణనష్టానికి దారితీస్తుండగా, మూడు మతాల వారికీ పవిత్రమైన జెరూసలేంలోని పవిత్ర స్థలాలకు ఉన్న ప్రాధాన్యం ఈ వివాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నది. అమెరికాలోని కొన్ని ఎవాంజెలికల్ క్రైస్తవ వర్గాలు బైబిల్ ప్రవచనాల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజ్య స్థాపనకు, దాని ఉనికికి మతపరమైన ప్రాధాన్యం ఆపాదిస్తూ ఆ దేశానికి భావోద్వేగపూరిత మద్దతు ఇస్తున్నాయి. క్రైస్తవ జియోనిజంగా గుర్తింపు పొందిన ఈ ధోరణి అంతర్జాతీయ రాజకీయాల్లో మత విశ్వాసాల ప్రభావాన్ని సూచిస్తున్నది. నాలుగున్నరేండ్లకు పైగా సాగుతున్న రష్యాఉక్రెయిన్ యుద్ధానికి మతం ప్రధాన కారణం కాకపోయినా, దేశీయంగా ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి, తన సైనిక చర్యలను సమర్థించుకోవడానికి సంప్రదాయ క్రైస్తవ నాగరికత పరిరక్షణ వంటి వాదనలను రష్యా నాయకత్వం ఉపయోగించుకుంటున్నది.
ప్రపంచవ్యాప్తంగా మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడంపై, ప్రపంచ చర్చిల సమాఖ్య కేంద్ర కమిటీ మోడరేటర్ బిషప్ హెన్రిచ్ బెడ్ఫోర్డ్డ్ స్ట్రామ్ అక్టోబర్ 13న ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని క్రైస్తవ వాదనలతో సమర్థించుకోవడాన్ని తప్పుబట్టారు. ఒక వివాదానికి మతపరమైన గుర్తింపు తోడైనా, మతమే ఘర్షణకు ప్రధాన కారణమైనా, అది ప్రభుత్వాల పరిధిని దాటి సంబంధిత దేశాల ప్రజల విశ్వాసాలు, భావోద్వేగాలతో ముడిపడుతుంది.
ఈ ధోరణి అంతర్జాతీయ సంబంధాలకే పరిమితం కావడం లేదు. భిన్న విశ్వాసాలకు చెందిన ప్రజలు నివసించే దేశాల్లో ఒక వర్గం గుర్తింపును రాజకీయ సమీకరణకు సాధనంగా మార్చడం ఇతర వర్గాల్లో అభద్రతను, అనుమానాలను పెంచుతుంది. చట్టం ముందు సమానత్వం వంటి ప్రజాస్వామ్య విలువలు బలహీనపడే ప్రమాదం ఏర్పడుతుంది. బౌద్ధమత ప్రాబల్యం కలిగిన మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలను వారి జాతి, మత గుర్తింపుల ఆధారంగా వివక్షకు గురిచేయడం, పౌరసత్వ హక్కులను నిరాకరించడం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఆ దేశ సైన్యం, అరాకాన్ ఆర్మీ చేతుల్లో రోహింగ్యాలు ఎదుర్కొంటున్న హింసను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ఆగస్టు 25న విడుదల చేసిన నివేదిక కూడా ప్రస్తావించింది.
పాకిస్థాన్‌లో హిందూ, క్రైస్తవ మైనారిటీలకు చెందిన బాలికల అపహరణలు, బలవంతపు వివాహాలు, మత మార్పిడులు, అహ్మదీలపై దాడులు, మతదూషణ చట్టాల దుర్వినియోగం కొనసాగుతున్నాయని ఆ దేశ మానవ హక్కుల కమిషన్ అక్టోబర్ 15న విడుదల చేసిన నివేదిక పేర్కొన్నది. అహ్మదీలు తమను తాము ముస్లింలుగా గుర్తించుకున్నప్పటికీ, వారిని పాకిస్థాన్ రాజ్యాంగం ముస్లిమేతరులుగా పరిగణిస్తున్నది. ఈ రెండు ఉదాహరణలు మత ఛాందసత్వం, గుర్తింపు ఆధారిత వివక్ష కారణంగా మైనారిటీల హక్కులు, పౌరుల భద్రత, అంతర్గత సామరస్యం ఎలా దెబ్బతినవచ్చో తెలియజేస్తున్నాయి. మతపరమైన ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది. పెట్టుబడుల్లో అనిశ్చితి పెరగడం, పర్యాటకం, వాణిజ్యం దెబ్బతినడం, ప్రభుత్వ వనరులు అభివృద్ధికి బదులుగా భద్రతా అవసరాలకు మళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.
దేశాల విదేశాంగ విధానాల్లో జాతీయ ప్రయోజనాలు మతపరమైన అనుబంధాలను అధిగమించిన సందర్భాలు సమకాలీన పరిణామాలకే పరిమితం కాలేదు. ఏడు దశాబ్దాల క్రితమే ఈ ధోరణి గోచరించింది. ఉదాహరణకు ముస్లిం సమాజంలో తనకంటూ బలమైన స్థానాన్ని కలిగి ఉన్న టర్కీ, 1952లో క్రైస్తవ మత ప్రభావం కలిగిన పాశ్చాత్య దేశాల ఆధిక్యమున్న నాటో రక్షణ కూటమిలో చేరింది. మత, నాగరికతాపరమైన బేధాలున్నప్పటికీ, ఆ కూటమిలో తన సభ్యత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నది. పాశ్చాత్య దేశాలతో తనకున్న భద్రతా, వ్యూహాత్మక ప్రయోజనాలే ఇందుకు ప్రధాన కారణం. భిన్న విశ్వాసాల పట్ల గౌరవం భారతీయ సనాతన ఆలోచనా సంప్రదాయంలోనూ ప్రస్ఫుటమవుతుంది.
ఋగ్వేదంలోని ‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’ అనే వాక్యం ‘సత్యం ఒక్కటే; జ్ఞానులు దానిని వివిధ రీతుల్లో వివరిస్తారు’ అనే భావనను ప్రతిబింబిస్తుంది. అశోకుడి 12వ శిలాశాసనం.. తన సంప్రదాయం గురించి స్వోత్కర్ష చేసుకుంటూ ఇతరుల సంప్రదాయాలను అకారణంగా తక్కువ చేయవద్దని, వారి అభిప్రాయాలను వినాలని, పరస్పర గౌరవం పాటించాలని సూచించింది. భిన్నత్వాన్ని గౌరవించడం మన చరిత్రలో కేవలం తాత్విక భావనగానే కాకుండా, సహస్రాబ్దాల క్రితమే పాలనా సిద్ధాంతంగా కూడా సూత్రీకరణ జరిగిందని ఈ ఉదాహరణలు తెలియజేస్తున్నాయి.
అందువల్ల, పాలనా నిర్ణయాలు రాజ్యాంగం, పౌరుల సమాన హక్కులు, ప్రజా సంక్షేమం, జాతీయ భద్రత వంటి అంశాల ఆధారంగా ఉండాలి. దేశాల మధ్య సంబంధాల్లోనూ మతపరమైన అనుబంధాల కంటే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఛాందస ధోరణులు తాత్కాలికంగా రాజకీయ మద్దతును సమీకరించగలిగినా, వాటి ప్రభావంతో ఏర్పడే విభేదాలు ముదిరితే రాజీకి, తిరిగి సామరస్యాన్ని నెలకొల్పుకోవడానికి మార్గాలు క్రమంగా మూసుకుపోతాయి. విభేదాలు మొక్కగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవడం సులభం; అవి మానుగా పెరిగి శాశ్వత శత్రుత్వంగా మారిన తర్వాత పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చు.
వ్యాసకర్త: ఎస్బీఐ రిటైర్డ్ ఉన్నతాధికారి
-కృష్ణ బాలాజీ పల్లపోతు,99490 98406
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

