భావప్రకటనకు సంకెళ్లు!
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు. అవినీతిని బయటపెట్టడం, అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడం, ప్రజాధనం దుర్వినియోగంపై ఆధారాలతో నిలదీయడం మీడియా బాధ్యత.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు. అవినీతిని బయటపెట్టడం, అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడం, ప్రజాధనం దుర్వినియోగంపై ఆధారాలతో నిలదీయడం మీడియా బాధ్యత. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ వ్యక్తిగత డాటా పరిరక్షణ చట్టం-2023 (డీపీడీపీ) మేరకు 2025లో జారీ చేసిన మార్గదర్శకాలు ఈ బాధ్యతల నిర్వహణకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉన్నది. చట్టంలోని నిబంధనలపై డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్‌పీఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఈ ఆందోళనల తీవ్రతను తెలియజేస్తున్నది. పిటిషనర్లలో అంబానీ-అదానీ మీడియా సంస్థలూ ఉండటం గమనార్హం. చట్టంలోని సెక్షన్4, 5, 6 ప్రకారం వ్యక్తిగత డాటా ప్రాసెసింగ్‌కు చట్టబద్ధమైన ప్రయోజనం, సమ్మతి, సమాచార నోటీస్ వంటి అంశాలు కీలకం.
సాధారణ వాణిజ్య కార్యకలాపాల్లో ఇవి అవసరమే. కానీ, పరిశోధనాత్మక జర్నలిజానికి ప్రత్యేక మినహాయింపు లేకపోవడమే సమస్య. ఒక అధికారి అవినీతికి పాల్పడితే, ఒక మంత్రి అక్రమ ఆస్తులు కూడబెడితే, ఒక సంస్థ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే, సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే పరిశోధన చేయాలా? ముందుగానే సమాచారం అందిస్తే ఆధారాలు మాయం చేసే అవకాశం ఉండదా? చట్టం నేరుగా వార్తలను నిషేధించకపోయినా, జరిమానాలు, న్యాయపరమైన చిక్కుల భయం స్వీయ సెన్సార్‌షిప్‌నకు దారితీసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. చట్టంలోని సెక్షన్ 17 కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డాటా ప్రాసెసింగ్‌కు మినహాయింపులు కల్పిస్తుంది. అయితే, ప్రజా ప్రయోజనాన్ని లక్ష్యంగా చేసుకున్న జర్నలిజానికి సమగ్రమైన, స్పష్టమైన మినహాయింపు లేకపోవడం ప్రధాన అభ్యంతరం.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లు రూపంలో ప్రజాస్వామిక హక్కులకు ఎసరు పెట్టే నిబంధనలు తేవాలని చూస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయికి చేరుకుంటున్న తరుణంలో సర్కార్ ఈ బిల్లును తెరమీదికి తేవడం గమనార్హం. డిజిటల్, సోషల్ మీడియాను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని నిబంధనలు న్యాయబద్ధమైన విమర్శ, పత్రికా స్వేచ్ఛ, రాజకీయ ప్రతిపక్షం.. ఈ మూడింటి గొంతు నొక్కేవిగా ఉన్నాయి.
పైగా రాజకీయ విమర్శల విషయంలో క్రిమినల్ కేసులు పెట్టరాదనీ, అరెస్టులు చేయరాదని హైకోర్టు నల్లబాలు కేసులో విస్పష్టంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇది రావడం కూడా ఆలోచించాల్సిన విషయం. విద్వేషాలు వ్యాపింపజేయకుండా అరికట్టడం, ప్రజల్లో సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అనేది ఎవరూ కాదనరు. కానీ ఆ వంకతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం, పాత్రికేయులను భయభ్రాంతులకు గురిచేయడం జరిగితే ప్రజాస్వామ్య హక్కులు హరించుకుపోతాయి. ఈ ఆలోచనతోనే ఈ బిల్లుపై శాసనసభ సెలెక్టు కమిటీకి విపక్ష బీఆర్ఎస్ ఇటీవల 11 పేజీల వినతిపత్రం సమర్పించింది. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరింది. అది వీలుకాకపోతే సరైన రక్షణలు కల్పిస్తూ బిల్లును సమూలంగా మార్చాలని, ప్రజల ముందు చర్చకు పెట్టాలని డిమాండ్ చేసింది.
విద్వేష ప్రసంగాలపై చర్య తీసుకునేందుకు దేశంలో ఇదివరకే పలు చట్టాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్ 2023)లోని 196, 197, 299, తదితర సెన్షన్ల్లు ఉన్నాయి. వీటికితోడుగా ఐటీ చట్టం (2000), తెహసీన్ పూనావాలా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలున్నాయి. సమస్య అంతా నిబంధనలు లేక కాదు, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలోనే ఉన్నది. ఆ చట్టాలు సరిపోవని మరిన్ని నిరంకుశాధికారాలను గుప్పిట్లోకి తీసుకునేందుకు కొత్తకొత్త చట్టాలు చేస్తున్నారు.
పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థులను, డిజిటల్ మీడియా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని చట్టాలకు కోరలు పెట్టాలని చూస్తుండటం దారుణం. ప్రభుత్వం పనితీరును తమ ప్రశ్నల ద్వారా ఎప్పటికప్పుడు అవి ఎండగడుతుండటమే అందుకు కారణం అనేది బహిరంగ రహస్యమే. రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి వెన్నెముక. వ్యక్తిగత గోప్యత కాపాడాల్సిందే, విద్వేష ప్రచారాలను కట్టడి చేయాల్సిందే. ఒక హక్కును కాపాడే పేరుతో మరొక హక్కును బలహీనపరచడం రాజ్యాంగ సమతుల్యతకు విఘాతం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా చట్టాల్లోని లోపాలను సవరించి, పారదర్శకతకు, స్వేచ్ఛకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

