నీళ్లు ఎత్తకుండా ఎల్ నినో సాకులా?
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ఈ నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనది. అలాంటి తెలంగాణలో ఇయ్యాల ఒక సీఎం రైతు ముందు నిలబడి ‘ఒక పంట వదులుకోండి’ అంటున్నరు. కారణం ఎల్ నినో అట.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ఈ నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనది. అలాంటి తెలంగాణలో ఇయ్యాల ఒక సీఎం రైతు ముందు నిలబడి ‘ఒక పంట వదులుకోండి’ అంటున్నరు. కారణం ఎల్ నినో అట. ఆ మాట విన్న రైతుకు నవ్వాలో, ఏడ్వాలో తెలుస్తలేదు. ఎండిన పొలాల గట్ల మీద, గేట్లు మూసిన కాలువల దగ్గర నేను చూస్తున్న నిజం వేరు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలో భీమా కాలువ నీళ్ల కోసం రెండు గ్రామాల రైతులు రాళ్లతో కొట్టుకున్నరు.
కల్వకుర్తి ప్రాంతంలో కాలువ గేట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు ఆపేసిన్రు. జూరాల ఎడమ కాలువ గేటు ఎత్తిన పాపానికి 11 మంది రైతుల మీద బెయిల్ రాని సెక్షన్లతో కేసులు పెట్టిన్రు. నిరుడు 37.56 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ప్రాజెక్టులు ఈ సారి కేవలం ఏడు లక్షల ఎకరాలకే ఇచ్చినయని నీటిపారుదల శాఖే ఒప్పుకొంటున్నది. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఈ వానకాలంలో రైతులు సుమారు కోటీ ఇరువై లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. కానీ సమస్య మొత్తం ఎల్ నినో చేసిన పనేనంటే ఎట్ల నమ్మాలె?
గత నెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను ఒక పంట వదులుకోమని, రాబోయే ఎనిమిదిపది నెలలు కష్టకాలమని చెప్పారు. ఎల్ నినో నిజమే. వర్షపాతం లోటు 17 నుంచి 20 శాతం ఉన్న మాట కూడా నిజమే. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారమే జలాశయాల్లో ఇప్పుడు 200 నుంచి 209 టీఎంసీలే ఉన్నాయి; పోయినేడు ఇదే సమయానికి 460 టీఎంసీలకు పైగా ఉండేవి. కానీ 2015లోనూ లోటు ఇంచుమించు ఇంతే ఉండేది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 231 మండలాల్లో కరువు ప్రకటించింది. ఇప్పుడు 18 జిల్లాల్లోని 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని పాలక ప్రభుత్వమే ప్రాథమిక అంచనాగా చెప్పింది.
ఇది ప్రాథమిక పోలికే అయినా, లోటు అదే, మండలాలు ఎక్కువ; అంటే వాన తక్కువ రావడం వల్ల జరిగిన నష్టం కన్నా ప్రభుత్వ పాలన సరిగా లేకపోవడం వలన జరిగిన నష్టమే ఎక్కువ. పైగా పంట వదులుకునే రైతుకు ఎకరాకు ఇంత అని ఏ పరిహారమూ ప్రకటించలేదు. కేంద్ర సాయం కోసం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపడం తప్పు కాదు; కానీ సొంతంగా చేయగలిగింది ముందు చేయాలి కదా? బీఆర్ఎస్ రాష్ట్ర నేత డా.ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నట్టు, ఇది ఎల్ నినో కాదు, ‘ఎల్కాంగో’ఎల్ నినో పేరు చెప్పి కాంగ్రెస్ కప్పిపుచ్చుకుంటున్న ముందుచూపు లేమి వలన వచ్చిన కరువు. ప్రభుత్వం రెండు మాటలు చెప్తున్నది; మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఎన్డీఎస్ఏ ఆంక్షలు ఉన్నాయి. ఎత్తిపోయడానికి వరద నీరే లేదు అంటున్నది. ఆంక్షలున్న మాట నిజం.
మేడిగడ్డ లోపాలపై విచారణలు, వివాదాలు ఉన్నాయి. న్యాయం తేలాల్సిందే. కానీ ఒక బరాజ్ లోపాన్ని చూపి మిగిలిన వ్యవస్థనంతా ఖాళీగా వదిలేయడం రైతుకు జవాబు కాదు. ప్రత్యామ్నాయమని చెప్తున్న తమ్మిడిహట్టి ఇంకా డీపీఆర్ దశలోనే ఉన్నది. రైతు అంతవరకు ఎదురుచూడలేడు. ఆంక్షలు మూడు బరాజ్లకే. దేవాదుల, కల్వకుర్తి, పాలమూరురంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా పంపులకు ఆ ఆంక్షలతో సంబంధం లేదు.
శ్రీశైలానికి ఈ ఏడాది జూలై 29న వరద మొదలైతే నార్లాపూర్ పంపులు గత నెల 14న వరకు నడవలేదని, అంటే 76 రోజులు ఆలస్యమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. జూన్ నుంచి 750 టీఎంసీల గోదావరి, 250 టీఎంసీల కృష్ణా నీరు కిందికి పోయాయని, సకాలంలో ఎత్తిపోసి ఉంటే సుమారు 40 టీఎంసీలతో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగేవారమని కేటీఆర్ లెక్క. కాళేశ్వరం వ్యవస్థలో 141 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాలు ఖాళీగా ఉన్నాయని, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయాలని బీఆర్ఎస్ అగ్ర నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు గత నెల 25న నీటిపారుదల మంత్రికి లేఖ రాశారు. కానీ ‘వరద నీరే లేదు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరి వెయ్యి టీఎంసీలు కిందికి ఎట్ల పోయినయి? ఇందుకు సీఎం సమాధానం చెప్పాలి లేదా హరీశ్‌రావు చెప్పిన లెక్కలు తప్పైతే ప్రభుత్వం తమ లెక్కలతో, పథకాల వారీగా ఖండించాలి. కానీ ఇప్పటివరకు ఖండించకుండా ‘ఎల్ నినో’ అని ఊరుకోవడమంటే సర్కార్ విఫలమైట్టేనని తేటతెల్లమవుతున్నది.
కృష్ణా బేసిన్లో కూడా ఇదే తీరు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని, ప్రాజెక్టులో సుమారు 180 టీఎంసీల నీరున్నా ఇవ్వడం లేదని కేటీఆర్ గత నెల 3న ఆరోపించారు. తాగునీటికే ముందు ప్రాధాన్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బదులిచ్చారు. శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ సుమారు 83 టీఎంసీలు వాడగా, హైదరాబాద్ తాగునీటితో కలిపి తెలంగాణ వాడింది 43 టీఎంసీలేనని హరీశ్‌రావు తెలిపారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ 84 టీఎంసీలని అన్నారు. ఇది తేల్చాల్సిన కృష్ణా బోర్డు సమావేశం గత నెల 1న జరగాల్సి ఉండగా, తెలంగాణ అభ్యర్థనపైనే వాయిదా పడింది.
కరెంట్ సంగతి ఇంకా దారుణం. గత నెల 14న ముఖ్యమంత్రే విద్యుత్తు కోతలు జరిగాయని అంగీకరించి, ఇంధన శాఖ ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. బొగ్గు నిల్వల కొరతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా అంగీకరించారు. కేసీఆర్ హయాంలో 2018 జనవరి 1 నుంచే 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల కరెంట్ ఇవ్వలేదా? యాదాద్రి కేంద్రం 4,000 మెగావాట్లకుగాను 1,500 మెగావాట్లే ఉత్పత్తి చేస్తున్నదని, పంట కాపాడుకోవడానికి రైతులు రోజుకు రూ.1,500 డీజిల్ జనరేటర్లకు ఖర్చు పెడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. తాగునీటిదీ ఇదే కథ; హైదరాబాద్‌లో 735 ఎంజీడీ డిమాండ్‌కు 585 ఎంజీడీయే సరఫరా అవుతున్నదని ఒక సీనియర్ అధికారి అంగీకరించారు. ఎల్ నినో హెచ్చరికలు నెలల ముందే నుంచి వచ్చాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ‘దూపైనప్పుడే బావి తొవ్వుకున్నట్టు’ చేసున్నది.
కేసీఆర్ హయాంలో 2015 కరువు నేర్పిన పాఠంతో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, పాలమూరురంగారెడ్డి పనులు చేపట్టారు. రైతుబంధు, రైతు బీమా ఇచ్చారు. ప్రతి శాఖనూ స్వయంగా సమీక్షించేవారు. రాష్ట్ర నికర సాగునీటి విస్తీర్ణం 201415లో 17.26 లక్షల హెక్టార్ల నుంచి 202021 నాటికి 33.64 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఆ కాలంలో వర్షాలు బాగా కురిసిన మాట నిజమే. కానీ ఆ నీటిని పట్టి ఉంచే చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు నీటిపారుదల ప్రాజెక్టులు లేకపోతే అవి కూడా సముద్రం పాలయ్యేవి.
పాలకులకు ముందుచూపు ఉన్నచోట ‘ఒక పంట వదులుకోండి’ అని అర్జీ పెట్టాల్సిన దుస్థితి రాదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతు నీళ్ల కోసం కాలువ గట్ల మీద కొట్లాడుకునే దినం రావాలని ఎవరు కోరుకున్నరు? కేసీఆర్ పాలనలో తలెత్తుకొని తిరిగినం; ఇయ్యాల తలవంచుకునే పరిస్థితి తెచ్చిన్రు. ఎల్ నినో వస్తది, పోతది. రైతు కన్నీళ్లకు జవాబు చెప్పాల్సింది పాలకులే. ‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’అడుగుతూనే ఉంటం, నిలదీస్తూనే ఉంటం. జై తెలంగాణ!
(వ్యాసకర్త: న్యాయవాది)
-కారుపోతుల రేవంత్ ,8985771375
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

