Jio Cinema – Walt Disney + Hotstar | దేశీయ క్రికెట్ అభిమానుల కోసం, సినిమా ప్రేక్షకుల కోసం రిలయన్స్ జియో తెచ్చిన లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కనుమరుగు అవుతుందా..? అవుననే సమాధానమే వస్తోంది. డిస్నీ+ హాట్ స్టార్ అనుబంధ స్టార్ ఇండియా, రిలయన్స్ అనుబంధ వయాకాం18 విలీనం నేపథ్యంలో రిలయన్స్ ప్రస్తుత లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జియో సినిమాను డిస్నీ+ హాట్ స్టార్లో విలీనం చేయనున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం. రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పాటయ్యే సంస్థకు ‘డిస్నీ+ హాట్ స్టార్’ పేరును కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
గత ఫిబ్రవరిలో రిలయన్స్ అనుబంధ వయాకాం18, వాల్ట్ డిస్నీ హాట్ స్టార్ అనుబంధ స్టార్ ఇండియా సంస్థల మధ్య 850 కోట్ల డాలర్ల విలువైన విలీన ఒప్పందం కుదిరింది. విలీన సంస్థ 100కి పైగా టీవీ చానెళ్లు, రెండు ప్రధాన లైవ్ స్ట్రీమింగ్ సర్వీసులపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఉన్నతమైన సాంకేతిక మౌలిక వసతులు కలిగి ఉన్న డిస్నీ+ హాట్ స్టార్ నాయకత్వాన్ని కొనసాగించాలని రిలయన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ల కోసం వేర్వేరు ప్లాట్ ఫామ్స్ నిర్వహించాలని రిలయన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జియో సినిమా నిర్వహిస్తున్న ఐపీఎల్ సహా పాపులర్ ఈవెంట్లను డిస్నీ+ హాట్ స్టార్ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.