న్యూఢిల్లీ, జూన్ 19 : నిన్న ఎన్ఎస్ఈ రూ.30,000 కోట్లు.. నేడు జియో ప్లాట్‌ఫామ్స్ 37,700 కోట్లు. దేశీయ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ వద్దకు బ్యాక్‌టుబ్యాక్ మెగా ఐపీవోలు క్యూ కట్టాయి. శుక్రవారం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది. దాదాపు రూ.37,700 కోట్ల (4 బిలియన్ డాలర్లు) నిధుల సమీకరణే లక్ష్యంగా ఇది వస్తున్నది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఐపీవోగా నిలువబోతున్నది. ప్రస్తు తం హ్యుందాయ్ మోటర్ రూ.37,700 కోట్ల (4 బిలియన్ డాలర్లు) నిధుల సమీకరణే లక్ష్యంగా ఇది వస్తున్నది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఐపీవోగా నిలువబోతున్నది. ప్రస్తుతం హ్యుందాయ్ మోటర్ రూ.27,870 కోట్ల ఐపీవోదే రికార్డు. జియో ఐపీవో వస్తే ఇది చెరిగిపోనున్నది. ఇక ఈ పబ్లిక్ ఇష్యూ సందర్భంగా 27 కోట్లదాకా ఫ్రెష్ షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఇది జియోలో 2.9 శాతం వాటాకు సమానం. జియోను దాదాపు 137 బిలియన్ డాలర్లుగా లెక్కించి ఈ ఐపీవోను తెస్తున్నారు. ఇక సమీకరించిన నిధుల్లో రూ.27,500 కోట్లను బకాయిలను చెల్లించడానికే వినియోగించనున్నారని సమాచారం.
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని త్వరలోనే తన వారసులకు ఇస్తానని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సారథి ముకేశ్ అంబానీ ఏజీఎంలో లక్షలాది వాటాదారులకు స్పష్టం చేశారు. ‘రిలయన్స్ వారసత్వం ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకున్నది. ప్రస్తుతం ఆకాశ్, ఇషా, అనంత్.. వారికి అప్పగించిన రోజువారీ వ్యాపార కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ఈ కంపెనీ భవిష్యత్తు కేవలం సురక్షితమైన నాయకుల చేతుల్లోనేగాక.. సంస్థ పేరు, ప్రఖ్యాతులను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టగల సమర్థుల చేతుల్లో ఉన్నదని నేను చెప్పగలను. పిల్లలు మూడేండ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో భాగమయ్యారు. ఇషా కన్జ్యూమర్ వ్యాపారాన్ని, ఆకాశ్ టెక్నాలజీ వ్యాపారాన్ని, అనంత్ ఎనర్జీ వ్యాపారానికి సారథ్యం వహిస్తున్నారు’ అని ముకేశ్ అంబానీ అన్నారు.
ఇదిలావుంటే వచ్చే నాలుగేండ్లలో తమ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) ఆదాయం రూ.లక్ష కోట్ల మార్కును తాకవచ్చని భావిస్తున్నామని, దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా, ప్రపంచ శ్రేణికి తగ్గట్టుగా ఎదుగడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ చెప్పారు. రాబోయే మూడేండ్లలో ఆర్సీపీఎల్ అదనంగా రూ.30,000 కోట్ల పెట్టుబడులను పెట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇక జమ్నగర్ రిఫైనరీ ప్లాంట్‌ను ప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి కలిగిన రిఫైనరీగా నిలబెట్టాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ కృషి చేస్తున్నదని, గత ఆర్థిక సంవత్సరం తమ ఆయిల్-టు-కెమికల్ వ్యాపారం ఆదాయం 5.7 శాతం ఎగిసి రూ.6.62 లక్షల కోట్లుగా నమోదైందని, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వివరించారు.
దేశీయ టెలికాం రంగంలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి రిలయన్స్ జియో అద్భుతాలనే సృష్టిస్తున్నది. ఆకర్షణీయమైన ఆఫర్లతో ఓవైపు కస్టమర్లను వేగంగా పెంచుకుంటూపోయిన సంస్థ.. మరోవైపు ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనిస్తూ మార్కెట్లో వాటిని వెనుకకు నెట్టింది. ఇలా భూమ్మీద టెలికాం సేవల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న జియో.. ఇప్పుడు ఆకాశంపైనా పాగా వేయాలని పరుగులు పెడుతున్నది. ఇందులో భాగంగానే శాట్‌కామ్ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు సంస్థ ప్రకటించింది. భారత్ కోసం సావరిన్ లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్టు జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ తెలిపారు.

‘ప్రస్తుతం శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, ఫ్రాన్స్‌కు చెందిన యూటెల్‌శాట్ వంటి విదేశీ సంస్థలదే పెత్తనం. అందుకే ఈ రంగంలో భారత్ సత్తా చాటాలి. దేశవ్యాప్తంగా శాటిలైట్ కనెక్టివిటీని విస్తరించాలి. జియో నెట్వర్క్ లేని దేశంలోని మారుమూల పల్లెలు, ద్వీపాలు, సరిహద్దు ప్రాంతాలను కూడా అనుసంధానించే లక్ష్యంతో వెళ్తున్నాం’ అని ఆకాశ్ అన్నారు. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో సావరిన్ గ్రౌండ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయనున్నట్టు వివరించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ గ్రూప్ ఏఐ వెంచర్ రిలయన్స్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నది. ‘లాభదాయక ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించాలన్నదే మా లక్ష్యం. గూగుల్, మెటా, ఎన్విదియాలతో రిలయన్స్‌కు భాగస్వామ్యం ఉన్నది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలను అందరికీ అందుబాటులోకి తెస్తాం’ అని అంబానీ అన్నారు. దేశంలోని అన్ని భాషల్లో, వ్యవసాయం దగ్గర్నుంచి విద్య, సంస్థాగత రంగాలదాకా సరిపోయే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించే యోచనలో ఉన్నట్టు తెలిపారు.
మొత్తానికి ఇప్పటికే అన్ని రంగాల్లో ఏఐ సంచలనాలను సృష్టిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ ఏఐని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలనే చేస్తున్నది. ఈ క్రమంలోనే ఏఐ ఏజెంట్ల కోసం జియో టెలిఫ్రేమ్ ఆవిష్కరణ, అందుబాటులోకి జియో కాల్ ఏజెంట్ (ఏఐ వాయిస్ అసిస్టెంట్) వంటివి రానున్నాయి. అలాగే గుజరాత్‌లోని జమ్నగర్లో సావరిన్ ఏఐ కీలక నిర్మాణం జరుగనున్నది. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో దేశం కోసం నవతరం ఏఐ నిర్మాణానికి భారతీయ యువ ఇంజినీర్లు సిద్ధం కావాలని ముకేశ్ అంబానీ పిలుపునిచ్చారు.

జియో నెట్‌వర్క్‌లోనే నేరుగా ఏఐ అసిస్టెంట్‌ను అనుసంధానం చేస్తూ కంపెనీ జియో కాల్ ఏఐ ఏజెంట్‌ను పరిచయం చేసింది. దీనికోసం యూజర్లు ఎలాంటి ప్రత్యేక యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మీరు ఎవరితోనైనా ఫోన్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు హేయ్ జియో అని పిలిస్తే చాలు..ఈ ఏఐ ఏజెంట్ యాక్టివేట్ కానున్నారు.
రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్ : పది మంది కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నా..అందరి మాటలను రియల్ టైమ్‌లో గుర్తించడం ఈ యాప్ ప్రత్యేకత. అంతేకాదు..మీ స్థానిక భాషల్లోనే సంక్షిప్త సమాచారం రూపంలోకి మారుస్తుండటం విశేషం. కాల్ ముగిసిన తర్వాత ఈ సంభాషణల సారాంశాన్ని అందిస్తున్నది. ఈ ఫోన్ కాల్ నుంచే క్యాబ్ బుకింగ్ చేసుకోవడంతోపాటు ఫుడ్ ఆర్డర్ చేయడం, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసేకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం కేవలం రీచార్జ్‌లు, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పరిమితమైన మై జియో యాప్‌ను కంపెనీ పూర్తిగా మార్చివేస్తున్నది. ఇకనుంచి ఈ యాప్ పర్సనల్ ఏఐ అడ్వైజర్, రిలేషన్షిప్ మేనేజర్‌గా వ్యవహరించనున్నది. యాప్‌లో వేర్వేరు ఆప్షన్ల కోసం వెతుక్కోకుండా..ఏమి కావాలో అది నోటితో చెప్తే ఏఐ అసిస్టెంట్ ఆ పనిని పూర్తి చేయనున్నారు.
ఇండ్లలో ఉండే పలు రకాల ఏఐ ఏజెంట్లకు ఓ కేంద్రంగా పనిచేసేలా జియో టెలిఫ్రేమ్ అనే సరికొత్త గ్యాడ్జెట్‌ను జియో ఆవిష్కరించింది. ఇది మీ గదిలోనే ఉంటూ..మీ రోజువారి అవసరాలను గుర్తించి స్మార్ట్ సలహాలు అందిస్తున్నది. డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే గుర్తు చేయడంతోపాటు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పలు సూచనలు చేయనున్నది.