Muslim Marriages | గువహటి, ఆగస్టు 21: ముస్లింల వివాహం, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అస్సాంలోని బీజేపీ సర్కార్ ఓ బిల్లును తీసుకురాబోతున్నది. గురువారం నుంచి ఇక్కడ ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ‘అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్స్ బిల్-2024’ను ప్రవేశపెడుతున్నట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా ప్రకటించారు. ‘ముస్లిం వివాహాలను ఇంతకు ముందు కాజీలు రిజిష్టర్ చేసేవారు. గతంలో మైనర్ల వివాహాల్ని కూడా కాజీలు రిజిష్టర్ చేశారు. కొత్త బిల్లు ప్రకారం అలా కుదరదు’ అని చెప్పారు.
పోర్న్ నిషేధించాలి
సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం
న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశవ్యాప్తంగా ఇటీవల మహిళలపై జరిగిన క్రూరమైన, భయంకరమైన నేరాల్ని సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం (ఎస్సీడబ్ల్యూఎల్ఏ) తీవ్రంగా ఖండించింది. బాలికలు, యువతుల రక్షణకు వెంటనే సమగ్రమైన సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షురాలు, సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి పావని బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అశ్లీలత, ఆన్లైన్లో పోర్నోగ్రఫీపై పూర్తిగా నిషేధం విధించాలని కోరారు.
24న మహారాష్ట్ర బంద్
ముంబై, ఆగస్టు 21( నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనకు నిరసనగా 24న మహారాష్ట్ర బంద్‌కు మహా వికాస్ అఘాడీ పిలుపునిచ్చింది. మహారాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న ఘటనలకు నిరసనగా బంద్ పాటించనున్నట్టు మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే తెలిపారు. ఈ బంద్‌లో మహావికాస్ అఘాడీకి చెందిన పార్టీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొంటారని తెలిపారు. మరోవైపు, లైంగిక దాడుల ఘటనకు నిరసనగా ఆందోళన చేసిన 68 మందిని పోలీసులు అరెస్టు చేశారు.