‘అడవిలో పెరిగిన అనాథలైన ఇద్దరు కవలల కథ ఇది. అడవిలో కుస్తీ పోటీలు నేర్చుకుని, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారు వీరిద్దరూ. ఆ కవలలుగా నేనే నటించాను. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి మంచి పాత్ర దొరకడం నిజంగా నా అదృష్టం.’ అన్నారు సహజనటి జయసుధ కుమారుడు, హీరో నిహిర్ కపూర్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడు. చదలవాడ పద్మావతి నిర్మాత. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిహిర్ కపూర్ విలేకరులతో ముచ్చటించారు. ‘కథలో హీరో కేరక్టరైజేషన్ నచ్చి చేయడానికి ఒప్పుకున్నాను.
సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి’ అని చెప్పారు నిహిర్. ఇంకా చెబుతూ ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ పోటీలు చూపిస్తున్నామని, కుస్తీ పోటీల నుంచి డబ్ల్యు డబ్ల్యూ దాకా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ కొత్తగా ఉంటుందని, ఇది దేశం గర్వించదగ్గ సినిమా అనీ, ఇలాంటి సినిమా ఒక భాషకే పరిమితం కాకూడదు కాబట్టే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని నిహిర్ అన్నారు. ‘మా అమ్మగారు ట్రైలర్‌తో పాటు సినిమా కూడా కొంతవరకు చూశారు. బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. సినిమా మొత్తం చూశాక ఎలా రియాక్టవుతారో చూడాలి. నా కథలు వినేంత టైమ్ అమ్మకు లేదు. అందుకే నేనే కథలు వింటున్నా. ‘హరిహరవీరమల్లు’లో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నాను. డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నాను. కొన్ని కథలు కూడా తయారు చేసుకున్నాను. ఓటీటీకీ, ఫ్యూచర్ ఫిల్మ్‌కి రెండిటికీ ట్రై చేస్తున్నాను’ అని చెప్పారు నిహిర్ కపూర్.