తాంసి, మార్చి 24 : నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎనిమిదో తరగతి విద్యార్థిని సాయిలిఖిత(14) మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవడంతో, ఆదిలాబాద్ జిల్లా తాంసి శ్మశానవాటికలో తహసీల్దార్ లక్ష్మి, మెండోర ఎస్సై సుహాసిని సమక్షంలో మంగళవారం డాక్టర్ అంకిత్రావు శవ పంచనామా చేసి నమూనాలను పరీక్షలకు పంపారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడంతో యంత్రాంగం స్పందించి ఎఫ్ఐఆర్, రీ-పోస్టుమార్టం చేపట్టడం గమనార్హం.
నిరుడు డిసెంబర్ 6న జ్వరంతో అస్వస్థతకు గురైన సాయిలిఖితకు సిబ్బంది స్థానికంగా చికిత్స అందించి, ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అకడ చికిత్స పొందుతూ డిసెంబర్ 17న మృతిచెందింది. కుటుంబసభ్యులు మొదట ఫిర్యాదు చేసినా కేసు నమోదుచేయలేదు. నిజామాబాద్ సీపీని ఆశ్రయించడంతో సోమవారం కేసు నమోదైంది. ఈ పరిణామాల మధ్య మృతదేహాన్ని వెలికితీసి రీ-పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. కాగా హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కూ తురు చనిపోయిందని, దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సాయి లిఖిత తండ్రి లింగన్న కోరారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న ఏఎన్ఎం మరణం కూడా అనుమానాస్పదంగా ఉన్నదని విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.