నార్నూర్, ఆగస్టు 18 : పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారికే గ్రామంలో ఝరి ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో డ్రైడే నిర్వహించారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్త, అంగన్వాడీ టీచర్ ఇంటింటికి వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తుండడంతో వీధులలో అపరిశుభ్రత లోపించి సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉంటాయన్నారు.
స్థానికులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. అపరిశుభ్రత లోపించకుండా చూడాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణతో పాటు గర్భిణులకు పలు సూచనలు చేశారు. మాతా శిశు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలని, ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. గ్రామాలలో చిన్నపాటి జ్వరం వచ్చిన హాస్పిటల్‌ను ఆశ్రయించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఆయన వెంట అంగన్వాడీ టీచర్ సుభద్ర ఉన్నారు.