ఫిట్నెస్ విషయంలో ఖచ్చితమైన లక్ష్యాల్ని నిర్దేశించుకున్నప్పుడే కోరుకున్న ఫలితాల్ని సాధిస్తామని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తుంది. బిజీ షెడ్యూల్స్‌లో కూడా వర్కవుట్స్ అస్సలు మిస్ చేయదు. అంతేకాదు వ్యాయామం తాలూకు వీడియోల్ని తరచు సోషల్‌మీడియా వేదికల్లో పంచుకుంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటుంది. తాజా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో మంచి ఫిట్నెస్ సాధించాలంటే ఏం కావాలో తెలియజేస్తూ ఓ పోస్ట్ చేసింది. కేవలం జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేస్తే సరిపోదని, ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలని సూచించింది. ఆరోగ్యకరమైన ఆలోచనల్ని అలవర్చుకుంటే శారీరకంగా మార్పు కనిపిస్తుందని చెప్పింది. ‘తొలుత ఈ వర్కవుట్స్, ఆహార నియంత్రణ చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అలవాటు చేసి చూసుకోండి..మీలో అద్భుతాలు రావడం గమనిస్తారు. ఏ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా స్థిరంగా ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యమని తెలుసుకోవాలి’ అని రష్మిక మందన్న పేర్కొంది.