ఓ వింత శిశువు జననం డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. జింకను పోలిన కాళ్లతో శిశువు జన్మించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా మన్పురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. నవజాత శిశువు కేవలం 1.04 కిలోల బరువుతో పుట్టాడు. ఇది నవజాత శిశువుల సాధారణ బరువు కంటే చాలా తక్కువ. ఈ పుట్టుక వైద్యపరంగా చాలా అరుదు.. అయినప్పటికీ శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి దవాఖానలోని ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
జన్యుపరమైనలోపం..
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జన్యువులు పిండం సరైన ఎదుగుదలను, పుట్టబోయే బిడ్డ సరైన అభివృద్ధిని నిరోధించగల నిర్దిష్ట మ్యుటేషన్స్ను మార్చవచ్చు. దీంతో శిశువులో పుట్టుకతో లోపాలు వస్తాయి.
క్రోమోజోమ్ సమస్యలు
పుట్టుకతో వచ్చే లోపాలకు మరో ప్రధాన కారణం క్రోమోజోమ్ సమస్య. కొన్ని సందర్భాల్లో క్రోమోజోమ్ లేకపోవడం లేదా అదనపు క్రోమోజోమ్ ఉండడం వల్ల పిండం సరైన ఎదుగుదలలో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు.
మందులు, రసాయనాలు లేదా టాక్సిన్స్..
గర్భిణి కొన్నిరకాల మందులు, రసాయనాలు లేదా టాక్సిన్స్ ప్రభావానికి గురైనప్పుడు శిశువులో పుట్టుకతో లోపాలు వస్తాయి. మద్యం, ధూమపానం పుట్టబోయే బిడ్డ మెదడులో తీవ్రమైన లోపాన్ని కలిగిస్తాయి.
ఇన్ఫెక్షన్లు..
కొన్ని అంటువ్యాధులు గర్భిణులకు పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనే అవకాశాలను కూడా పెంచుతాయి. ఉదాహరణకు జికా వైరస్, కొవిడ్-19 వైరస్ మొదలైనవి.
పోషకాలు లేకపోవడం..
సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం లేదా శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోవడం కూడా గర్భిణికి ప్రసవ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలను పెంచుతాయి. గర్భిణులు కచ్చితంగా తీసుకోవాల్సిన పోషకం ఫోలిక్ యాసిడ్. దీనిలోపం వల్ల న్యూరల్ ట్యూబ్లో లోపాలు వస్తాయి.