Iran | టెహ్రాన్, సెప్టెంబర్ 30: హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు అడ్డుకట్ట వేయాలని ఇరాన్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. అణుబాంబు ప్రయోగించాలని ఛాందసవాదులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని వారు కోరుతున్నారు. ఛాందసవాది సయ్యద్ జలీల్ అనుచరులు ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజిష్కియాన్ చేతిలో జలీల్ ఓటమిపాలయ్యారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇరాన్ ఇప్పటికే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. ఇక మిగిలింది అణు కార్డే. ఇదే పశ్చిమ దేశాలను చర్చలకు కూర్చోబెడుతుంది’ ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ సొహ్రబ్ సాలేహి ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇరాన్‌కు త్వరలోనే విముక్తి: నెతన్యాహూ
ఇరాన్లో పౌరులకు సరైన ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఇరాన్ ప్రభుత్వం విఫలమైందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆరోపించారు. ఖమేనీ పాలనలో వారు అంధకారంలో కూరుకుపోయారని, పలు రంగాలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ఇరాన్ త్వరలోనే విముక్తి పొందుతుందని పేర్కొన్నారు.