రంగారెడ్డి, సెప్టెంబర్ 8, (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకంలో భాగంగా మొదటి విడుతతోపాటు రెండో విడుతకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డి.అమయ్‌కుమార్ అధ్యక్షతన దళిత బంధుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడుతలో పెండింగ్‌లో ఉన్న, రెండో విడుత దళిత బంధు యూనిట్లకు సంబంధించి త్వరితగతిన గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇందుకుగాను వీలైనంత త్వరలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితాను అందజేయాలన్నారు.
సమన్వయంతో పనులు వేగవంతం చేయాలి
రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 697 యూనిట్లు మంజూరుకాగా, 691 యూనిట్లను గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. రెండో విడుతలో నియోజకవర్గానికి 1500 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని.. మొదటగా నియోజకవర్గానికి 500 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. రెండో విడుత లబ్ధిదారుల ఎంపికకు ఎమ్మెల్యేలు త్వరితగతిన వివరాలను అందజేయాలన్నారు. మొదటి విడుతలో గ్రౌండింగ్ అయిన యూనిట్లను.. ఇంకా పనులు చేపట్టనివారి వివరాలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అందజేసి వారి సమన్వయంతో పనులు వేగవంతం అయ్యేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు పనులు చేపట్టేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలి
ఎమ్మెల్యేలందరూ వారానికి ఒకసారి సమయం తీసుకొని జిల్లాలో దళిత బంధు కింద వచ్చిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. మరోవైపు దళిత బంధు యూనిట్ల ఎంపిక విషయంలో గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని, లబ్ధిదారులు చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటు వైపు మొగ్గు చూపేలా ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అంజయ్యయాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి ప్రవీణ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అంజిలప్ప, మెప్మా పీడీ శ్రీపాద రామేశ్వరం పాల్గొన్నారు.