రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ఆద్యంతం నిలదీతలతో కొనసాగింది. క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేసేందుకుగాను బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు సంబంధించి జిల్లాలో స్పందన కరువైంది. జిల్లాలోని కేశంపేట, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో సాగిన పాదయాత్రకు స్థానిక ప్రజలు నుంచి మద్దతు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు పాదయాత్రకు జనాలను రప్పించేందుకు కష్టాలు పడ్డారు. పాదయాత్రలో పాల్గొనేందుకుగాను డబ్బులిచ్చి మహిళలను పిలిచినా గంటలోనే తిరిగి వెళ్లిపోవడంతో బండి సంజయ్ వెంబడి వచ్చిన కరీంనగర్ నేతలు, కార్యకర్తలతోనే పాదయాత్రను కొనసాగించారు. అదేవిధంగా జిల్లాలోని కేశంపేట మండలంలో స్థానిక ప్రజలతో జరిగిన ముఖాముఖిలో మహిళలు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. జనాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక బిత్తరపోవడం బండి సంజయ్ వంతైంది. అంతేకాకుండా పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అవాస్తవాలు, ఆరోపణలతో తన ప్రసంగం కొనసాగడం గమనార్హం. అబద్ధాల ప్రసంగాలకు జనాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు.
బండిని నిలదీసిన మహిళలు..
జిల్లాలో జరిగిన బండి సంజయ్ పాదయాత్ర స్థానిక మహిళల నిలదీతలతో సాగింది. కేశంపేట మండలంలోని సంతాపూర్‌లో పాదయాత్రలో భాగంగా స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. అయితే బీజేపీని జనాల్లోకి తీసుకుపోదామనుకున్న బండి సంజయ్‌కు సంబంధిత గ్రామ ప్రజలు షాక్ ఇచ్చారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. సంతాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ నా భర్త, నా కుటుంబం అంతా గత కొన్నేండ్లుగా బీజేపీ కోసం పనిచేసింది. కానీ నా భర్త చనిపోతే బీజేపీ నాయకులు ఒక్కరూ కూడా రూపాయి సాయం చేయలేదు. మా కుటుంబం బీజేపీకి మద్దతుదారులమని తెలిసినప్పటికీ పార్టీలతో సంబంధం లేకుండా మాకు రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలు ఇచ్చి మా కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఆదుకున్నారు.
బీజేపీ మాత్రం ఏం చేయలేదని నిలదీసింది. బీజేపీ గురించి గొప్పలు చెబుదామనుకున్న బండి సంజయ్‌కు ఆ మహిళ నిలదీతతో కర్రు కాల్చి వాత పెట్టినట్లయింది. స్థానిక ప్రజల ఎదురుదాడితో ముఖాముఖి ముచ్చట ముగించి బండి అక్కడ్నుంచి జారుకోవడం గమనార్హం. అదేవిధంగా కేశంపేట మండలంలోని మరో గ్రామమైన కొత్తపేటలో నిత్యావసర ధరలు, డీజిలు, పెట్రోలు ధరలపై కొత్తపేట గ్రామానికి చెందిన మహిళ బండిని గట్టిగా ప్రశ్నించింది. మేం రోజు కూలీకి వెళ్తే మాకు ఇచ్చేది రూ.200లు కుటుంబం అంతా ఎట్లా బతకాలని ప్రశ్నించింది. కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలతో పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిలదీశారు. వంట నూనెల ధరలను అమాంతం పెంచేశారు. కిలో వంటనూనె రూ.200లకు చేరిందని, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటాయని పేద ప్రజలం మేం ఎట్లా బతకాలి అని పక్కన ఉన్న మహిళలంతా ఒక్కసారిగా ప్రశ్నించడంతో బిత్తరపోవడం బండి సంజయ్ వంతైంది. దీంతో బీజేపీ నేతలు సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అక్కడ్నుంచి బండి సంజయ్ టీం పరారైంది.