‘విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టి రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలి..’ అని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జూమ్ యాప్ ద్వారా మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ)సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ నిధులతోపాటు దాతలు ఇచ్చే నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. ఉపాధిహామీ పథకంతో వైకుంఠధామాలు, రోడ్లు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, నర్సరీలు వంటి పనులను చేయించాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర బృందం తనిఖీలు చేసి సంతృప్తి వ్యక్తం చేసినందున సంబంధిత అధికారులను ఎంపీ అభినందించారు.
షాబాద్, మార్చి 20: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యావైద్యంపై ప్రత్యేక దృష్టిని సారించిందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు చేపట్టి రంగారెడ్డి జిల్లాను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యు డు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జూమ్ యాప్ ద్వారా మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, సర్పంచులు, కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) లతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ‘మన ఊరు-మనబడి’ ద్వారా ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ సారించి దాతల నుంచి విరాళాలను సేకరించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతులైన మరుగుదొడ్లు, తాగునీరు, అదనపు తరగతి గదులు, ప్రహరీ తదితర పనులను చేపట్టి విద్యార్థులు బాగా చదువుకునేలా చూడాలన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా వైకుంఠధామాలు, రోడ్లు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, నర్సరీల వంటి పలు అభివృద్ధి పనులను కూలీల ద్వారా చేపట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. అనంతరం ఆయన శాఖలవారీగా కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను కేంద్ర బృందం ఆకస్మికంగా తనిఖీలు చేసి సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన అధికారులను అభినందించారు.
చేవెళ్లలో వెంటనే బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మికి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు నూతనంగా 21 బస్తీ దవాఖానాలు మంజూరైనట్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు క్యాంపుల ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డీఈవోను ఎంపీ రంజిత్‌రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తిరస్కరణకు గురైతే వెం టనే వాటి వివరాలను తెలపాలని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి, షాబాద్, చేవెళ్ల, యాచారం, కందుకూరు మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలను పునరుద్ధరించినట్లు జిల్లా సంక్షేమాధికారి ఎంపీకి వివరించారు.
త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో గ్రూప్-1, గ్రూప్-2, బ్యాంకింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు చిలుకూరులో ఉచితంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డీఆర్డీవో ప్రభాకర్‌కు సూచించారు. చిలుకూరులో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అమయ్‌కుమార్ ఎంపీకి తెలిపారు. రైతువేదికల ద్వారా రైతులకు పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డిని ఆదేశించారు. రైతులు పండించిన పం టలను ఈనామ్ ద్వారా విక్రయించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు వైండింగ్ పనులను చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారి ధర్మారావును ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగాంధీ, కలెక్టర్ అమయ్‌కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.