యాచారం, మార్చి 20 : పల్లెల్లో పచ్చదనం వెల్లివిరియాలని.. గ్రామీణ ప్రాంతాల్లోని ఊరూవాడ హరితమయం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాల్లో హరితహారం ఒకటి. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పథకం కింద మొక్కలు నాటించి, పచ్చదనాన్ని పెంపొందించడానికి పెద్దపీట వేస్తున్నారు. దీనికోసం తగిన నిధులను కేటాయించి పలు గ్రామాల్లో వననర్సరీలను ఏర్పాటు చేసి హరితహారాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఐదేండ్లుగా ఈజీఎస్, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో హరితహారం ద్వారా లక్షల సంఖ్యలో వివిధ రకాల మొక్కలను నాటించారు.
ఈఏడాది కూడా మరింత పచ్చదనం వైపు అడుగులేసేందుకు, మండలంలోని అన్ని గ్రామాల్లో 100శాతం హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించుకోవాలని అధికారులు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీని నిర్వహించి జూలైలో చేపట్టే హరితహారానికి మొక్కలు అందుబాటులో ఉంచాలని కృషి చేస్తున్నారు. మండలంలో 24 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపడుతున్నారు. మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఏపీవో లింగయ్య నర్సరీలను పరిశీలిస్తూ మొక్కల పెంపకంపై ప్రధాన దృష్టి సారించారు. గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటుచేయాలని ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మండుటెండలతో మొక్కలు ఎండిపోకుండా చలువ పందిళ్ల(గ్రీన్నెట్ షెడ్లు)ను ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షిస్తున్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు
హరితహారం కోసం వననర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలంలో మొత్తం 24నర్సరీలకు గ్రీన్నెట్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి నుంచి మొక్కలను సంరక్షించేందుకు గ్రీన్ నెట్ షెడ్లను ఏర్పాటు చేశారు. వాటిని నీటితో తడుపుతూ మొక్కలకు చలువదనాన్ని తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు.
24గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు
మండలంలోని 24పంచాయతీలకు గాను 24నర్సరీలు కొనసాగిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద చౌదర్పల్లి, తాటిపర్తి, నానక్‌నగర్, నల్లవెల్లి, మేడిపల్లి, తమ్మలోనిగూడ, నజ్దిక్‌సింగారం, మల్కీజ్‌గూడ, మంథన్‌గౌరెల్లి, నందివనపర్తి, మాల్, కొత్తపల్లి, తులేఖుర్ధు, అయ్యవారిగూడ, యాచారం, చింతపట్ల గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గున్గల్, గడ్డమల్లాయగూడ గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి హరితహారం కింద నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలను నిర్వహించాలని, నర్సరీలు లేని గ్రామాల్లో మొక్కలను పెంచడానికి స్థలాలను పరిశీలించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో అధికారులు అడుగులేస్తున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను 100శాతం సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నారు.
టార్గెట్ 4.32లక్షలు
మండలంలో 24నర్సరీలకు గాను ఒక్కొక్క నర్సరీలో 18,000ల మొక్కల చొప్పున వచ్చే హరితహారం టార్గెట్ 4.32లక్షల మొక్కలు నాటాలి. ఇందులో ఉపాధిహామీ పథకం, అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను పెంచుతున్నారు. 24నర్సరీల్లో వివిధ రకాల పండ్లు, నీడనిచ్చే మొక్కలు, వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో టేకు, కానుగ, జామ, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, బొప్పాయి, మునగ, వేప, గుల్మోర్, గులాబీ, మల్లె, మందార మొక్కలను పెంచుతున్నారు. వీటిని సంక్షించేందుకు అధికారులు, ఆయా శాఖల సిబ్బంది ముమ్మరంగా కృషి చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత
ఉపాధిహామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న నర్సరీల్లో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను సంరక్షించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు వర్షా కాలం వరకూ నర్సరీ మొక్కలను బతికించి వాటిని నాటించాలి. మండలంలోని చిన్న గ్రామాల్లో 20వేల మొక్కలు, పెద్ద గ్రామాల్లో 40వేల మొక్కలను హరితహారం కింద నాటించి, సంరక్షించాలి. నర్సరీ మొక్కలకు నీరందించేలా చూడాలి. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ 6మొక్కలను పంపిణీ చేసి నాటించాలి. ఇచ్చిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయించాలి. గ్రామాల్లో రోడ్లకిరువైపులా, రైతు పొలంగట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటించేందుకు కృషి చేయాలి. దీనికోసం ఉపాధి, అటవీ, పంచాయతీరాజ్ సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
లక్ష్య సాధనకు కృషి చేయాలి
పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి, హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి నర్సరీలో 18వేల మొక్కలను పెంచేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలి. నర్సరీల్లో పెంచుతున్న ప్రతి మొక్కనూ బతికించుకోవాలి. రాష్ట్ర పంచాయతీరాజ్-2018 హరితహారం లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ కృషి చేయాలి. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
– విజయలక్ష్మి, ఎంపీడీవో యాచారం