రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. ప్రతి చెరువుకు జియోట్యాగింగ్ చేసి, మ్యాప్‌ను సైతం ఆన్లైన్లో పొందుపర్చింది. ఇందులో భాగంగా చెరువు విస్తీర్ణం తెలుసుకునేందుకు డిజిటల్ సర్వే చేపట్టడంతో పాటు ఎఫ్టీఎల్(నీటి నిలువ సామర్థ్యం)ను గుర్తించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందించింది. ఎవరైనా చెరువు స్థలాన్ని కబ్జా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నది. రంగారెడ్డి జిల్లాలో 2,339 చెరువులు ఉండగా, ఇప్పటికే 2 వేల చెరువులకు డిజిటల్ సర్వే చేపట్టి, ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంకు లెవల్)ను గుర్తించింది. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తున్నది. ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ పూర్తైన తర్వాత చెరువు విస్తీర్ణం, తూము, అలుగు వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తారు కాబట్టి కబ్జాకు గురైతే ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క చెరువూ అక్రమార్కుల పాలుకాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రంగారెడ్డి, నవంబర్ 6, (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వాలు విస్మరించిన చెరువులకు మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూర్వ వైభవం తీసుకువచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులను కాపాడేందుకుగాను తీసుకోవాల్సిన అన్ని చర్యలను చేపట్టింది. ఇప్పటికే అన్ని చెరువులకు జియోట్యాగింగ్ ప్రక్రియ చేయడంతోపాటు చెరువుల సర్వే, ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇకపై ఏ ఒక్క చెరువు కూడా కబ్జాకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతీ ఏటా చెరువుల ఎఫ్టీఎల్ భూములు తగ్గుతూ పోతుండడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు ఎఫ్టీఎల్ భూముల కబ్జాలకు పాల్పడగా.. గతేడాది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువులు నిండి చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి నెలకొనడంతో దాదాపు పదిహేను రోజులపాటు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకుగాను ప్రతీ చెరువును డిజిటల్ సర్వే చేయడంతోపాటు ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియను జిల్లా అంతటా నిర్వహిస్తున్నారు. ఏదేమైనా గత ప్రభుత్వాలు విస్మరించిన చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు చెరువులు కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.
ఇప్పటివరకు 2 వేల చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపు
జిల్లాలో చెరువులకు ఎఫ్టీఎల్(నీటి నిలువ సామర్థ్యం) గుర్తించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జిల్లాలోని ఏ ఒక్క చెరువూ కబ్జాకు గురికాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతీ ఒక్క చెరువును క్షుణ్ణంగా సర్వే చేయడంతోపాటు ఆయా చెరువుల రికార్డులను పరిశీలించి ఎఫ్టీఎల్ భూమి ఎంత ఉందనే వివరాలను సేకరించి ఎఫ్టీఎల్ను గుర్తిస్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులను సర్వే నిర్వహించడంతోపాటు ఎఫ్టీఎల్ గుర్తించగా, ప్రస్తుతం జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌తోపాటు ప్రతీ చెరువుకు ప్రత్యేకంగా మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే జియోట్యాగింగ్ పూర్తైన దృష్ట్యా సర్వే, ఎఫ్టీఎల్, మ్యాపుల తయారుతో ఇకపై ఒక్క క్లిక్‌తో సంబంధిత చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ భూమితోపాటు పూర్తి సమాచారం రానుంది. జిల్లాలో 2339 చెరువులుండగా 69 వేల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో 1078 చెరువులున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 2 వేల చెరువులకు సంబంధించి సర్వే పూర్తి కావడంతోపాటు ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మిగతా చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే జియోట్యాగింగ్ పూర్తి
చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకుగాను ఇప్పటికే మిషన్ కాకతీయ పనులతో జిల్లాలోని చెరువులకు జలకళరాగా, ప్రస్తుతం కబ్జాలకు గురవుతున్న చెరువులను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని చెరువులకు సంబంధించి జియోట్యాగింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. జియోట్యాగింగ్ ప్రక్రియతో జిల్లాలో ఎన్ని చెరువులున్నాయి, చెరువుల ఫొటోతోపాటు తూము, అలుగు వివరాలు నీటి పారుదల శాఖ సిబ్బంది సేకరించి, వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. జియోట్యాగింగ్ ప్రక్రియతో ఆన్లైన్లో ఒక్క క్లిక్‌తో జిల్లాలోని ఏ చెరువు ఎక్కడుంది, సంబంధిత చెరువు తూము, అలుగు పూర్తి వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చెరువుల యొక్క నీటి నిల్వ సామర్థ్యం కూడా పక్కాగా తెలిసిపోతుంది. అయితే ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ పూర్తైన తర్వాత మరోసారి ఆన్‌లోన్‌లో వివరాలను పొందుపర్చనున్నారు. చెరువుల తూము, అలుగు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినట్లయితే ఒకవేళ చెరువులను కబ్జా చేసినప్పటికీ సులువుగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 2339 చెరువులుండగా.. 69,197 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. జిల్లాలోని ఆయా డివిజన్లలోని చెరువులకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్లో 875 చెరువులుండగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 141, హయత్‌నగర్‌లో 7, ఇబ్రహీంపట్నంలో 122, మంచాలలో 301, యాచారంలో 137, సరూర్‌నగర్‌లో 5, బాలాపూర్‌లో 48, మాడ్గులలో 114 చెరువులున్నాయి. శంషాబాద్ సబ్ డివిజన్లో 579 చెరువులుండగా 14,942 ఎకరాల ఆయకట్టు ఉంది. చేవెళ్ల డివిజన్లో మొత్తం 306 చెరువులుండగా 9671 ఎకరాల ఆయకట్టు ఉంది. షాద్‌నగర్ డివిజన్లో 579 చెరువులుండగా 19,996 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ జరుగుతున్నది
జిల్లాలోని చెరువుల ఎఫ్టీఎల్ గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెలాఖరు వరకు అన్ని చెరువులను సర్వే నిర్వహించడంతోపాటు ఎఫ్టీఎల్ భూములను గుర్తిస్తాం. జిల్లాలోని ఏ ఒక్క చెరువుకూ సంబంధించిన ఇంచు భూమి కూడా కబ్జాకు గురికాకుండా చర్యలు చేపట్టాం. ఎఫ్టీఎల్ గుర్తించిన అనంతరం మరోసారి అన్ని చెరువుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తాం.