మానసిక, శారీరక దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. వారు జీవితాంతం దివ్యాంగులుగానే మిగిలిపోకుండా వారికున్న లోపాలను అధిగమించేందుకు ప్రత్యేక పునరావాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి శిక్షణ ఇస్తున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలోని సెర్ప్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నది. అక్కడి ప్రత్యేక సిబ్బంది నిర్ధారణ పరీక్షలతో వైకల్యం శాతాన్ని గుర్తించి అందుకనుగుణంగా సేవలందిస్తున్నారు. 2005 నుంచి రంగారెడ్డి జిల్లాలో పునరావాస కేంద్రాల సేవలు కొనసాగుతున్నాయి. మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, కేశంపేట్‌లో కేంద్రాలుండగా.. ఇప్పటివరకు 510 మందికి నయమైంది. లోపాలను అధిగమించినవారు సాధారణ మనుషులుగా ఎవరిపై ఆధారపడకుండా వారిపని వారు చేసుకుంటున్నారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 2 : ఎదుగుదల లోపాలు, వైకల్యంగల దివ్యాంగులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. దివ్యాంగుల పునరావాస కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి దివ్యాంగులకు చేయూతనందిస్తున్నది. ఎదుగుదల లోపాలు, వైకల్యం ఉన్నవారు జీవితాంతం దివ్యాంగులుగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి లేకుండా నయమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సరిగ్గా మాట్లాడలేనివారు, నడువలేనివారు, వినలేనివారు.. ఇలా ఏ వైకల్యం ఉన్నా గతంలో జీవితాంతం అలాగే ఉండే పరిస్థితి నెలకొని ఉండేది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఆయా వైకల్యం, లోపాలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఎంత శాతం మేర వైకల్యం ఉందో గుర్తించి, అందుకు అనుగుణంగా సేవలందిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలోని సెర్ప్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2005 నుంచి జిల్లాలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. 16 ఏండ్లలో ఎంతో మంది దివ్యాంగులకు పునరావాస కేంద్రాలు అందించిన సేవలతో సాధారణ మనుషులుగా తమ పని తాము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, కేశంపేట మండలాల్లో పునరావాస కేంద్రాలు దివ్యాంగుల సహాయార్థం పనిచేస్తున్నాయి. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల సంక్షేమ దినంగా పాటిస్తున్నారు.
ఇప్పటివరకు 510 మందికి నయం
జిల్లా గ్రామీణాభివృద్ధి, సెర్ప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలతో చాలా మంది దివ్యాంగులు మామూలు మనుషులయ్యారు. ఎదుగుదలలో లోపం ఉండడంతో సరిగ్గా నడువకపోవడం, మాట్లాడలేకపోవడం, వినబడకపోవడం వంటి వైకల్యాలతో ఉన్న పిల్లలకు సేవలందించి వారందరినీ సాధారణ స్థితికి తీసుకువచ్చారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ఎదుగుదల లోపాలతోపాటు వైకల్యంగల 510 మంది దివ్యాంగులు మామూలు స్థితికి వచ్చారు. అయితే వీరిలో సరిగ్గా నడువలేనివారు-220, మానసిక స్థితి సరిగ్గా లేనివారు-201, వినికిడి లోపంగలవారు-58, చూపు సరిగ్గా లేనివారు-31 మంది ఉన్నారు. ఆయా కేంద్రాల్లో దివ్యాంగులకు సంబంధించి… కేశంపేట పునరావాస కేంద్రంలో 74 మంది, మహేశ్వరంలో 70, మంచాలలో 127, యాచారంలో 122, కందుకూరులో 117 మందికి నయమైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మరోవైపు దివ్యాంగులు వైకల్యాన్ని జయించేందుకుగాను కావాల్సిన వసతులన్నీ ప్రభుత్వమే అందజేస్తూ వస్తున్నది. వైకల్యాలను జయించి సాధారణ స్థితికి చేరుకున్న దివ్యాంగులు వారి కుటుంబానికి చేదోడుగా ఉండడంతోపాటు ఏదో ఒక స్వయం ఉపాధి పనిచేసుకుంటున్నారు. కొందరు ఉపాధి హామీ పనులకు కూడా పోతున్నారు.
పునరావాస కేంద్రాల్లో సేవలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దివ్యాంగుల పునరావాస కేంద్రాల్లో చాలా రకాల సేవలందుతున్నాయి. ఎదుగుదల లోపం, వైకల్యంగల పిల్లలకు పునరావాస కేంద్రాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించడం, ఎదుగుదల లోపాలున్న పిల్లలను గుర్తించి వారికి ఫిజియోథెరపీ సేవలందిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుండడంతోపాటు అవసరమైన నిర్ధారణ పరీక్షలు, ఆపరేషన్స్, సహాయ పరికరాలను అందిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఏడాది నుంచి 6 ఏండ్ల పిల్లలకు సేవలందిస్తున్నారు. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, ప్రత్యేక విద్యా సేవలు నిపుణుల ద్వారా నిర్వహిస్తున్నారు. దివ్యాంగుల పిల్లలకు తమ వైకల్యాన్ని మరిచిపోయేలా ఆటాపాట, మాటల ద్వారా మనోవికాసాన్ని కలిగిస్తున్నాయి. వికలత్వం రావడానికిగల కారణాలు, నివారణ చర్యలపై మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించడం, అవసరమైన వారికి సహాయ పరికరాలు అందించడం వంటి సేవలందిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో సీఆర్పీ, కార్యకర్త, ఆయా, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్, ఫిజియో థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ప్రత్యేక విద్యా నిపుణులు పనిచేస్తున్నారు. అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్, పింఛన్, ఉచిత సహాయ పరికరాలు, ఉచిత రాయితీ బస్సు, రైల్వే పాసులు, వివాహ ప్రోత్సాహక బహుమతులు, ప్రత్యేక వసతిగృహాలు, బ్యాంకుల ద్వారా రుణాలు, సెర్ప్ ద్వారా సామాజిక పెట్టుబడి నిధులు, ప్రత్యేక విద్యావంతులకు, వృత్తివిద్యా కోర్సులు చేసే విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలను ప్రభుత్వమే సమకూర్చుతూ దివ్యాంగులకు అండగా నిలుస్తున్నది.