రంగారెడ్డి, డిసెంబర్ 2, (నమస్తే తెలంగాణ) : కొవిడ్ వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నా.. వేగంగా వ్యాపించనున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, బయటకు వెళ్లినప్పుడు భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. కొత్త వేరియెంట్‌ను ఎదుర్కొనేందుకు కొండాపూర్‌లోని జిల్లా దవాఖాన, వనస్థలిపురంలోని ఏరియా దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్స్‌ను సిద్ధం చేసిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. కొండాపూర్‌లోని జిల్లా దవాఖానలో 100 పడకలు, వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో 100 పడకల ఆక్సిజన్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి. జిల్లా పరిధిలోని ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ కేసులు నమోదైతే ఎప్పటికప్పుడు తెలిసేందుకు కొత్తగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను స్పీడ్ పెంచి, జిల్లాలోని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
40.52 లక్షల డోసుల
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 113 శాతం మేర ఫస్ట్ డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కొత్త వేరియెంట్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ పెంచారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఫ్రంట్‌లైన్ వారియర్స్, సూపర్ స్ప్రెడర్స్, ఇలా 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలతో పాటు మొబైల్ వాహనాల ద్వారా కొనసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 40,52,150 డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. వీటిలో ఫస్ట్ డోస్‌కు సంబంధించి అర్హులైన వారు 24,82,083 డోసులుండగా, సెకండ్ డోస్‌కు సంబంధించి 15,70,067 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. సెకండ్ డోస్‌కు సంబంధించి ఇప్పటి వరకు 63 శాతం మేర పూర్తయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ శంకర్పల్లి మండలంలోని శేరిగూడ గ్రామంలో పూర్తికాగా, జిల్లాలోని 184 ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతంలోని 201 కాలనీల్లోనూ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. జిల్లా అంతటా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రతి కాలనీ, గ్రామాల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించడంతోపాటు క్షేత్రస్థాయికి వెళ్లి మరీ వైద్యబృందాలు వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ మొబైల్ వాహనాల ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 24 మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవడంలో కొంత మంది కొవిడ్ పోయిందనే నిర్లక్ష్యం వహిస్తుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ మరోసారి ఇంటింటి సర్వే చేపట్టింది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలను సేకరించడంతోపాటు వారు సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తికాగా, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో పదిహేను రోజుల్లో వంద శాతం పూర్తయ్యేలా సంబంధిత అధికారులు దృష్టి సారించారు.
వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకోండి
కొత్త వేరియెంట్ దృష్ట్యా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడంపై ప్రజలకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. వ్యాక్సిన్ వేసుకున్నామని కొందరు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. రెండో డోసు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. రెండో డోస్ తీసుకోని వారి వివరాలను సేకరిస్తున్నాం.