హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో ఓ హీరో వీరాభిమాని పాత్రలో రామ్ కనిపించనున్నారు. మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర ఆన్‌స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. బుధవారం చిత్రంలోని నాలుగో పాటను బాలానగర్ విమల్ థియేటర్లో అభిమానుల సమక్షంలో రిలీజ్ చేశారు.
అభిమానులు తమ అభిమాన స్టార్ల సినిమాలను సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో ఈ పాటను తెరకెక్కించారు. సినిమాల పట్ల అభిమానుల ఇష్టం, ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూడాలనే ఆతృతకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. హీరో వీరాభిమాని పాత్రలో రామ్ తనదైన డ్యాన్స్, వైబ్‌తో అదరగొట్డాడు. అభిమానుల అంకితభావాన్ని ప్రజెంట్ చేసే గీతంగా ఈ పాట మెప్పించింది. రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్, మెర్విన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌బాబు పి.