యాదాద్రి, ఏప్రిల్ 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రతిష్ఠ మహోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం వేద పండితులు, అర్చకులు, పురోహితులు, పరిచారులు, స్వాములు, రుత్వికుల బృందంతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేదఘోశ, వేదస్వస్తితో యాగశాల ద్వారతోరణం పూజా విధాన కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం జలాధివాసం చేసిన శిలామయ, లోహమయ మూర్తులకు శుక్రవారం ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలు, ఫలరసాలు, గంధోదకం, బస్మోదకం, దూర్వోదకంతో పంచామృత స్నానాలు, శుద్ధోదకంగా జలాలతో వేదమంత్రాలతో అభిషేకించి శుద్ధి పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠామూర్తుల ముందు దర్పాలను పెట్టి, తెర అడ్డంగా పెట్టి నేత్రోన్మీలనం కార్యక్రమాలను స్తపతులు, వేదమూర్తులు పూర్తి చేశారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఏయే అధివాసాలు పూర్తయ్యాయో ఆయా అధివాసాలకు హోమాదులు, మూలమంత్ర అధిష్టాన హవనాలు చేపట్టారు. అనంతరం మహానీరాజన మంత్రపుష్పాలు చేపట్టి, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధానార్చకుడు నర్సింహారాములు శర్మ, ప్రధాన పురోహితుడు గౌరిభట్ల సత్యనారాయణశర్మ పాల్గొన్నారు.