Ram Mandir : అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని గుర్తించినట్లు సిట్ తెలిపింది. ఈ నెల 25న ఈ కేసుపై చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసుపై విచారణ జరగగా.. స్టేటస్ రిపోర్టును సిట్ సమర్పించింది. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు సిట్ విచారణను పర్యవేక్షిస్తోంది. ఈ సందర్బంగా సోమవారం ఈ కేసు పురోగతిపై స్టేటస్ రిపోర్టును కోర్టుకు సిట్ వివరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కేసును విచారిస్తున్నారు. సిట్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదన వినిపించారు. ఈ సందర్బంగా కోర్టుకు సిట్ తెలిపిన వివరాలివి. ఈ కేసు విచారణపై సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతోపాటు అన్ని ఆధారాల్ని సిట్ విచారించింది. ఈ కేసు విచారణ దాదాపు పూర్తైంది. సెప్టెంబర్ 25న చార్జిషీటు దాఖలు చేయనున్నారు. ఈ వ్యవహారంలో గల్లంతైన డబ్బును, ఇతర వస్తువుల్ని సిట్ గుర్తించింది.
విచారణలో సాక్ష్యాలుగా ఉపయోగపడే తగిన డాక్యుమెంట్లను, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను సిట్ సాధించింది. డొనేషన్ల వివరాలు, రిసీట్స్, సంబంధిత డాక్యుమెంట్లు, సాఫ్ట్వేర్ కూడా సిట్ దగ్గర ఉన్నాయి. చోరీకి గురైన వాటిలో సేకరించిన వాటిని ఎస్బీఐ లాకర్లలో భద్రపరిచారు. అయోధ్య రామాలయాన్ని పర్యవేక్షించే శ్రీరామ జన్మభూతి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన సీఈవోగా జితేంద్ర మిశ్ర నియమితుడైన సంగతి తెలిసిందే. 5,585 మంది దరఖాస్తుదారుల్లో తాను ఈ పదవికి ఎంపిక కావడం తన అదృష్టమన్నారు.