Ram Charan | మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఈ ఆనందం రెట్టింపైంది. ఒక మగ బిడ్డ, ఒక ఆడ బిడ్డ జన్మించడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ దంపతులకు క్లీంకార అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్విన్స్ పుట్టడంతో కుటుంబంలో డబుల్ సంబరాలు నెలకొన్నాయి. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్–ఉపాసన దంపతులు అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చారు.తమపై అపారమైన ప్రేమ చూపిస్తున్న అభిమానుల ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు.
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక అభిమాని గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చేస్తూ షేర్ చేసిన వీడియోలో రెండు రకాల స్వీట్లు ఉండటం కనిపించింది. “రామ్ చరణ్ – ఉపాసనలకు అభినందనలు… అపోలో నుంచి ఈ బహుమతి అందింది” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ట్విన్స్ పుట్టిన వెంటనే అభిమానులు అపోలో ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుని సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానుల ప్రేమకు ప్రతిఫలంగా ఈ స్వీట్ బాక్సులు పంపినట్లు తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘పెద్ది’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా, మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, కమెడియన్ సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో మంచి స్పందన రాబట్టగా, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఒకవైపు కుటుంబంలో ఆనంద క్షణాలు, మరోవైపు కెరీర్లో భారీ ప్రాజెక్టులతో రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు.