అమరావతి : అమరావతి రాజధాని ( Amaravati Capital ) చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం ( Rajya Sabha Approves ) తెలిపింది . గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన సమావేశంలో అమరావతి బిల్లుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో టీడీపీ, బీజేపీ, శివసేన, కాంగ్రెస్ ,ఆప్, జేడీయూ, బీఆర్ఎస్ తదితర పార్టీలకు చెందిన సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు.
దాదాపు మూడు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం రాజ్యసభ చైర్మన్ , భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ బిల్లుకు మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఏపీ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ తరుపున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రైతుల వద్ద నుంచి రాజధాని అభివృద్ధికి ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. మరో 50 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారని ఇందుకు మరో లక్ష కోట్లు అవసరమని , ఇంత పెద్ద ఎత్తున నిధుల సమీకరణ సాధ్యమయ్యే పనేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.