Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ‘‘తరాలు మారినా.. రజనీకాంత్ అంటే సినీ ప్రియుల్లో అద్భుతమైన ఆసక్తి, ఉత్సాహం అలాగే కొనసాగుతూనే ఉంది. అతను తన నటనతో, స్టైల్‌తో, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు’’ అంటూ పవన్ పేర్కొన్నారు. తమిళనాడులోని చెన్నైలో రజనీకాంత్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లలో ఉండే ఉత్సాహాన్ని ఎన్నోసార్లు చూశానని పవన్ గుర్తు చేసుకున్నారు. ‘‘వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజనీ’ అని టైటిల్ వేయగానే ప్రేక్షకుల్లో ఉప్పొంగే ఉత్సాహం చూడదగ్గది’’ అని చెప్పారు.
ప్రతినాయకుడిగా కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్, కథానాయకుడిగా అగ్రస్థానాన్ని సాధించారని, నటనలో తనదైన ప్రత్యేకతను చూపించి ఎంతోమంది నటులకు ఆదర్శంగా నిలిచారని పవన్ కల్యాణ్ కొనియాడారు. నడకలో, సంభాషణల్లో, హావభావాల్లో ఉన్న వైవిధ్యం, ఆయన ప్రత్యేకతగా అభివర్ణించారు. రజనీకాంత్ నటుడిగా మాత్రమే కాదు, మహావతార్ బాబాజీ భక్తుడిగా, ఆధ్యాత్మిక సాధనలో ముందుండే వ్యక్తిగా తనకెంతో గౌరవంగా భావిస్తున్నానని పవన్ అన్నారు. యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పంథాలో ఆయన చూపే ఆసక్తి చాలామందికి ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.
సినీ రంగంలో 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న రజనీకాంత్ మరిన్ని విభిన్న పాత్రలతో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నాను. ఆయురారోగ్యాలతో, ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని గడపాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దీనికి రజనీకాంత్ స్పందిస్తూ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి, నా సోదరుడు, పొలిటికల్ తుపాను పవన్ కళ్యాణ్‌కి నా ధన్యవాదాలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కి పవన్ కళ్యాణ్ స్పందించారు. నా పెద్ద సోదరుడు , గౌరవనీయులైన రజనీకాంత్ సర్.. మీ మాటలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు . మీరు గొప్ప విజయాలు సాధించాలి. ఆరోగ్యంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు.
Respected Sir and Big Brother , Thiru @rajinikanth Avl, I am truly grateful for your affectionate words and blessings. I cherish them in my heart with the deepest respect and gratitude.May your path of enlightenment continues with glory , success and good health. https://t.co/uqffZGsLRH
— Pawan Kalyan (@PawanKalyan) August 17, 2025