Fauzi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. వైవిధ్యమైన కథ, ప్రభాస్ లుక్, హను రాఘవపూడి టేకింగ్ కారణంగా ఈ సినిమాపై మొదటి నుంచే పాజిటివ్ బజ్ కొనసాగుతోంది. అయితే కొన్ని నెలల క్రితం ‘ఫౌజీ’ షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ అనారోగ్యానికి గురైనట్లు వార్తలు రావడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయనను ఓ విషపురుగు కుట్టిందని, దాని కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని తాజాగా రాజేష్ శర్మ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన అనారోగ్యానికి ‘ఫౌజీ’ షూటింగ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫౌజీ’ షూటింగ్ సందర్భంగా దట్టమైన చెట్ల మధ్య టెక్నీషియన్లతో రాజేష్ శర్మ మాట్లాడుతున్న సమయంలో ఆయనను ఓ కీటకం కుట్టిందని అప్పట్లో బెంగాలీ నటి సుదీప ఛటర్జీ వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.ఆ సమయంలో పెద్దగా ఇబ్బంది అనిపించకపోవడంతో రాజేష్ శర్మ దానిని పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. అయితే షూటింగ్ పూర్తయిన కొన్ని గంటల తర్వాత ఆయన కాలిలో తీవ్రమైన నొప్పి మొదలైందని, అనంతరం కోల్‌కతాకు వెళ్తున్న సమయంలో విమానంలో తీవ్ర జ్వరం వచ్చిందని వార్తలు వచ్చాయి.పరిస్థితి విషమించడంతో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయనను చేర్పించినట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో ‘ఫౌజీ’ షూటింగ్లో విషపురుగు కుట్టడం వల్లే రాజేష్ శర్మ అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజేష్ శర్మ ఈ ప్రచారంపై స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. ‘ఫౌజీ’ షూటింగ్లో తనకు ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని ఆయన స్పష్టం చేశారు. అది ముమ్మాటికీ అబద్ధమే. ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా సెట్స్‌లో నాకు ఏం జరగలేదు. నేను అనారోగ్యానికి గురి కావడం వెనుక ప్రభాస్ కానీ, ఆయన సినిమా యూనిట్ కానీ ఎంత మాత్రం బాధ్యులు కారు. వాళ్లందరూ మంచి వ్యక్తులు అని రాజేష్ శర్మ పేర్కొన్నారు.హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో తనకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదని ఆయన తెలిపారు. కోల్‌కతాకు వెళ్లిన తర్వాత ఒకట్రెండు రోజులకు మాత్రమే తన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారిందని వివరించారు. తన అనారోగ్యానికి అసలు కారణం విషపురుగు కాటు కాదని రాజేష్ శర్మ వెల్లడించారు. తన కుడి కాలును చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న చర్మ సంబంధిత సమస్య కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు.తనకు డయాబెటిస్ ఎక్కువగా ఉండటం, ప్రారంభ దశలో ఆ సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రతరం అయిందని ఆయన వివరించారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని, అయితే దీనికి ‘ఫౌజీ’ షూటింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.