Vijay Deverakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా థియేటర్ల వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్, మహేశ్ బాబు, రవితేజ వంటి అగ్ర కథానాయకులు రెండేసి మల్టీప్లెక్స్‌లతో తమ వ్యాపారాన్ని విస్తరిస్తుండగా తాజాగా అదే బాటాలో రౌడీ హీరో కూడా నడవబోతున్నట్లు తెలుస్తుంది. ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ‘ఏవీడీ సినిమాస్’ (AVD Cinemas) పేరుతో ఒక అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను నిర్వహిస్తున్న ఆయన, ఇప్పుడు మరో కొత్త మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
నార్త్ హైదరాబాద్‌లోని ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మేడ్చల్ లేదా మల్కాజ్గిరి ప్రాంతంలో ఈ కొత్త మల్టీప్లెక్స్‌ను నిర్మించాలని ఆయన యోచిస్తున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ప్రణాళిక ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.