Rajeev Kanakala | తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ‘స్టూడెంట్ నెం.1’ ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు బలమైన పునాది వేసిన ఈ సినిమా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రయాణానికి కూడా తొలి మెట్టుగా నిలిచింది. 2001 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాలో కీలకమైన ‘సత్య’ పాత్రలో నటించిన రాజీవ్ కనకాల అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘స్టూడెంట్ నెం.1’ తనకు కేవలం ఒక సినిమా కాదని, తన వ్యక్తిగత జీవితంతో పాటు నటుడిగా తన కెరీర్‌ను కూడా మలుపు తిప్పిన ప్రత్యేకమైన అధ్యాయమని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాతే నటనను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకుని సినీ రంగంలో కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
ముఖ్యంగా సినిమాలో తాను పోషించిన ‘సత్య’ పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణను ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా కొంతమంది తనను ‘సత్య’ పేరుతో గుర్తుపట్టి పలకరిస్తుంటారని, ఆ అనుభూతి తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. తన కెరీర్లో ఎంతో కీలకమైన అవకాశాన్ని అందించిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి రాజీవ్ కనకాల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు గురువులాంటి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, తనకు ఎంతో ఇష్టమైన తారక్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, నిర్మాతలు, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
‘స్టూడెంట్ నెం.1’ తనకు సినిమా మాత్రమే కాకుండా ఎంతో విలువైన స్నేహాలను కూడా అందించిందని రాజీవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత కూడా కొనసాగిందని, తదుపరి రోజుల్లో ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడానికి ఆ అనుబంధమే కారణమైందని గుర్తుచేసుకున్నారు.సినిమా విడుదలకు ముందు ఎదురైన పరిస్థితులను కూడా రాజీవ్ కనకాల తన పోస్టులో గుర్తుచేసుకున్నారు. ‘స్టూడెంట్ నెం.1’ విజయం సాధించదని, సినిమా ఫ్లాప్ అవుతుందని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారని తెలిపారు. అయితే ప్రేక్షకుల తీర్పు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. ఒక సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం సాధారణ విషయం కాదని, ముఖ్యంగా తన జీవితంతో ఇంత బలమైన అనుబంధం ఉన్న సినిమా కావడంతో ‘స్టూడెంట్ నెం.1’ తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
25 Years of Student No.1 ❤️🎬
25 ఏళ్ల క్రితం వచ్చిన Student No.1… ఒక సినిమా మాత్రమే కాదు, నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం.
ఈ సినిమా తర్వాతే నేను పూర్తిగా సినిమాల్లోకి వచ్చాను. ‘సత్య’ అనే పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ఆ పాత్ర గురించి గుర్తు… pic.twitter.com/cdlynlflls
— Raajeev kanakala (@RajeevCo) September 29, 2026