నమస్తే తెలంగాణ క్రీడా విభాగం:రాజస్థాన్ రాయల్స్..పేరుకు తగ్గట్లే ఐపీఎల్ ఆరంభ సీజన్లో చాంపియన్‌గా నిలిచిన టీమ్. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ షేన్‌వార్న్ సారథ్యంలో 2008లో తొలి టైటిల్‌ను రాయల్‌గా ముద్దాడింది. అయితే గడిచిన 17 సీజన్లలో రాజస్థాన్ మళ్లీ చాంపియన్‌గా నిలువలేకపోయింది. 2022లో రన్నరప్ మినహా తిరిగి ఫైనల్ పోరులో నిలిచింది లేదు. అలా అనీ ప్రతిభ కల్గిన ప్లేయర్లకు జట్టులో కొదువలేదు. కానీ కావాల్సిందల్లా సమిష్టితత్వం. వ్యక్తిగతంగా కొంతమంది క్రికెటర్లు రాణిస్తున్నా..సమిష్టితత్వం లోపించడమే ఆ జట్టు టైటిల్ కలను దూరం చేస్తున్నది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో బట్లర్, చాహల్, బౌల్ట్ లాంటి క్రికెటర్లను వదులుకున్న రాయల్స్ రానున్న సీజన్ కోసం సమాయత్తమవుతున్నది.
కుమార సంగక్కర స్థానంలో చీఫ్‌కోచ్‌గా వచ్చిన రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశకత్వంలో తిరిగి గాడిలో పడేందుకు రాజస్థాన్ ప్రణాళికలు రచిస్తున్నది. గత ఏడు సీజన్లు రాయల్స్‌కు ప్రాతినిధ్యం ఇంగ్లండ్ హార్డ్‌హిట్టర్ బట్లర్ లేని లోటు రాయల్స్‌లో స్పష్టంగా కనిపిస్తున్నది. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ గతిని శాసించే సత్తా ఉన్న బట్లర్‌కు వదులుకున్నందుకు రాయల్స్ మూ ల్యం చెల్లించుకునే అవకాశముంది. ఇదిలా ఉంటే కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్నెస్ సందిగ్ధత నెలకొన్నది. ఆరు రోజుల వ్యవధిలో లీగ్ మొదలుకానున్న నేపథ్యంలో శాంసన్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈనెల 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ నాటికి శాంసన్ జట్టులోకి వచ్చేది అనుమానంగానే ఉంది. శాంసన్ గైర్హాజరీలో కెప్టెన్ ఎవరన్నది తేలాల్సి ఉంది. యశస్వి జైస్వాల్, హెట్‌మైర్, జురెల్, రియాన్ పరాగ్ బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంది. ఆర్చర్, మహీశ్ తీక్షణ, హసరంగ చేరికతో బౌలింగ్ ఒకింత బలంగా కనిపిస్తున్నది. రాయల్స్‌కు రెండో టైటిల్ దక్కుతుందో లేదో చూడాలి.
రాయల్స్ ప్రస్థానం:
2008: విజేత
2013, 15, 18, 24: ప్లేఆఫ్స్
2022: రన్నరప్