Rajamouli | భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కుతున్న ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ మూవీ ‘SSMB29’ (గ్లోబ్ ట్రాటర్) పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచ యాత్ర నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ డ్రామా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. వందల కోట్ల బడ్జెట్‌తో, అంతర్జాతీయ టెక్నీషియన్లు మరియు హాలీవుడ్ టీమ్‌తో కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. సమాచారం ప్రకారం, ఈ చిత్రం 120 దేశాల్లో విడుదలై, 100 కోట్ల మందికి చేరువయ్యేలా ప్లాన్ చేయబడింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.10,000 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్న జక్కన్న, ఈ ప్రాజెక్ట్‌తో ఇండియన్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు.
తాజాగా విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ”, ప్రియాంక చోప్రా “మందాకిని” పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఎప్పుడూ చూడని లుక్‌లలో ఈ ఇద్దరిని చూపిస్తూ రాజమౌళి తన విజన్‌తో మరోసారి సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రం గ్లోబల్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి స్పెషల్‌గా ప్లాన్ చేసిన ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ ఈవెంట్లో మహేష్ బాబు లుక్, సినిమా కాన్సెప్ట్ గ్లింప్స్, ప్రధాన నటీనటుల వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఈ ఈవెంట్‌ను కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాదు, ఇంటర్నేషనల్ ప్రమోషన్ స్ట్రాటజీకి తగినట్టుగా రూపొందిస్తున్నారు. మీడియా ఆహ్వానం లేకపోవడం కూడా ఈ ఈవెంట్‌పై ఆసక్తిని పెంచుతోంది.
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు రాజమౌళి సుమారు రూ.30 కోట్ల ఖర్చు చేయగా, ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘జియో హాట్ స్టార్’కి రూ.50 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అంటే ఈవెంట్ మొదలయ్యేలోపే లాభాల్లోకి వెళ్లిపోయింది! ఇది జక్కన్న కమర్షియల్ విజన్ ఎంత షార్ప్‌గా ఉందో మళ్లీ నిరూపించింది. రాజమౌళి సినిమాలకు నష్టాలు రావు. ఆయన ఎక్కడ ఖర్చు పెట్టినా, దానికి మించి వసూలు చేసే స్ట్రాటజీతోనే ముందుకు సాగుతారు. అందుకే ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు ఆయనతో పని చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటాయి. ‘కుంభ’, ‘మందాకిని’ పోస్టర్లతో ఇప్పటికే హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లిన జక్కన్న, ఇప్పుడు మహేష్ బాబు లుక్ రివీల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు.