‘యాక్షన్, వినోదం అంశాల కలబోతగా సాగే చిత్రమిది. కేసు ఛేదనలో ఎన్ఐఏ ఏజెంట్‌కు ఎదురయ్యే పరిస్థితులు నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతాయి’ అని అన్నారు శ్రీ సరిపల్లి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. కార్తికేయ హీరోగా నటించారు. 88 రామారెడ్డి నిర్మించారు. ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో శ్రీ సరిపల్లి పాత్రికేయులతో పంచుకున్న సంగతులివి..
విజయవాడ నా స్వస్థలం. అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్‌లో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కోర్సు పూర్తిచేశా. ‘నాయక్’ నుంచి ‘అల్లుడు శ్రీను’ వరకు వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశా. ఎన్ఐఏ ఏజెంట్‌గా కొత్తగా ఉద్యోగబాధ్యతల్ని చేపట్టిన ఓ యువకుడి కథ ఇది. తన తప్పు కారణంగా అసంపూర్తిగా మిగిలిన ఓ కేసును అతడు ఎలా పూర్తిచేశాడన్నది థ్రిల్‌ను పంచుతుంది. కథలో సందర్భానుసారంగా వినోదం ఉంటుంది తప్పితే ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ కనిపించవు. ఎన్ఐఏ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఎక్కువగా తీవ్రవాదం, దేశరక్షణ లాంటి అంశాలతో ముడిపడి సాగుతుంటాయి. వాటికి భిన్నంగా దేశంలో అంతర్గతంగా ఎదురయ్యే సమస్యలపై వారు పోరాటం చేయగలరని ఈ సినిమాలో చూపించబోతున్నాం. హీరో క్యారెక్టరైజేషన్‌కు అనుగుణంగా ఈ సినిమాకు ‘రాజా విక్రమార్క’ అనే టైటిల్ పెట్టాం. మాకున్న టైటిల్స్‌లో ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. టైటిల్ మాకు బోనస్‌గా మారింది.
ఎంటర్టైన్మెంట్ నా బలం
‘ఆర్ఎక్స్100’ చూసిన తర్వాత ఎన్ఐఏ ఏజెంట్ పాత్రకు కార్తికేయ సరిపోతాడని నిర్ణయానికి వచ్చా. ఆయన్ని కలిసి కథచెప్పగానే అంగీకరించారు. తన బాడీలాంగ్వేజ్, కామెడీ టైమింగ్ కొత్తగా ఉంటాయి. ద్వితీయార్థం ఊహకందని మలుపులతో సాగుతుంది. స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిగా తాన్య రవిచంద్రన్ కనిపిస్తుంది. ఏడు పాత్రల నేపథ్యంలో కథ మొత్తం సాగుతుంది. వాటి మధ్య ఉన్న సంబంధం ఆసక్తికరంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ నా బలం. ఎలాంటి కథనైనా వినోదాత్మక పంథాలోనే చెప్పడానికి ఇష్టపడతా.