హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 07025 ప్రత్యేక రైలు ఈనెల 4న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు, 07026 ప్రత్యేక రైలు 5న తిరుచానూరు నుంచి చర్లపల్లికి నడుస్తాయని పేర్కొన్నారు. అలాగే 9న హైదరాబాద్-మంగళూరుల మధ్య 07097, 10న మంగళూరు-హైదరాబాద్ మధ్య 07098 నంబర్ గల ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్,సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గతంలో ఇచ్చిన తాతాలిక స్టాప్‌ను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీటిలో నరసాపురం-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ (17255), లింగంపల్లి-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17256), కాకినాడ టౌన్-లింగంపల్లి కోకనాడ ఎక్స్‌ప్రెస్ (12775), లింగంపల్లి-కాకినాడటౌన్ కోకనాడ ఎక్స్‌ప్రెస్ (12776) రైళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు.
దీంతో నరసాపురం-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ హైటెక్ సిటీ రైల్వేస్టేషన్లో ప్రతిరోజూ ఉదయం 4.45కు ఆగనున్నదని తెలిపారు. లింగంపల్లి-నరసాపురం ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 9.08 గంటలకు, కాకినాడ-లింగంపల్లి కోకనాడ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.10గంటలకు ఆగుతుందని వెల్లడించారు. ఈ మూడు రైళ్లు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు హైటెక్ సిటీ స్టేషన్లో ప్రతి రోజూ స్టాప్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే లింగంపల్లి-కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ రాత్రి 7.08కు ఆగుతుందని తెలిపారు. ఈ రైలు డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు స్టాప్ ఉంటుందని పేర్కొన్నారు.