ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. ఇటలీ నేపథ్యంలో వింటేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులముందుకురానుంది. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమాలోని ఫస్ట్‌సింగిల్‌ను సోమవారం విడుదల చేశారు. ‘ఎవరో వీరెవరో..కలవని ప్రేమికులా..ఎవరో వీరెవరో..విడిపోని యాత్రికులా..వీరి దారొకటి..మరి దిక్కులే వేరులే…ఊపిరొకటేలే..ఒక శ్వాసలా నిశ్వాసలా ఆటాడే విధా ఇదా ఇదా’ అంటూ చక్కటి ప్రణయభావాలతో ఈ గీతం ఆకట్టుకునేలా సాగింది. కె.కె. రచన చేసిన ఈ గీతానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాల్ని సమకూర్చారు. యువన్‌శంకర్‌రాజా, హరిణి ఆలపించారు. ‘చాలా కాలం విరామం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రమిది. ఇందులో ఆయన భవిష్యత్తును ఊహించే విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తారు. యూరప్ నేపథ్యంలో జరిగే వింటేజ్ ప్రేమకథగా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్ఖేడ్కర్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌పరమహంస, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.కె.రాధాకృష్ణకుమార్.