వరంగల్, నవంబర్ 4 : గ్రేటర్ వరంగల్ పరిధిలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పాలన చేతకావడం లేదని ట్రాన్స్‌జెండర్, బీఎస్పీ నాయకురాలు పుష్పిత లయ ఆరోపించారు. పరిపాలన రాని గ్రేటర్ ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. మంగళవారం ఆమె వరంగల్ జిల్లా రామన్నపేటలో మీడియాతో మాట్లాడారు. ఒక్కరోజు వర్షానికే నగరం మునిగిపోవడానికి ఎమ్మెల్యేల కమీషన్ల కక్కుర్తే కారణమని విమర్శించారు.
నాలాల కబ్జాల వెనుక ఎమ్మెల్యేల హస్తం ఉన్నదని మండిపడ్డారు. నాలాలపై అక్రమ నిర్మాణాలతో బొందివాగు, నయీంనగర్ ప్రధాన నాలాలు కుంచించుకుపోయినట్టు తెలిపారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే నగరం మునిగిందని ఆమె ధ్వజమెత్తారు. హైడ్రా లాంటి పథకం వరంగల్‌కు రాకుండా అడ్డుకుంటున్నది గ్రేటర్ పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ అని ఆరోపించారు.