పంజాబ్ పంజాబ్ పోలీసులు అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు దగ్గర 2 వేల ఏళ్ల నాటి బుద్ధుడి రాతి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్, ఆర్ట్ ట్రెజర్ యాక్ట్-1972 కింద ఆ విగ్రహాన్ని సీజ్ చేశారు. పాకిస్థాన్ నుంచి అత్తారీ-వాఘా సరిహద్దు ద్వారా పంజాబ్‌లోకి ప్రవేశించిన ఒక విదేశీయుడి బ్యాగులో రాయితో తయారుచేసిన బుద్ధ విగ్రహం దొరికింది. ఆ బుద్ధ విగ్రహం ఏ కాలం నాటిది అనేది తెలుసుకునేందుకు పంజాబ్ పోలీసులు ఛండీగఢ్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లను సంప్రదించారు.
‘ఇది గాంధార స్కూల్‌కి చెందిన బుద్ధుడి విగ్రహం అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. ఈ విగ్రహం రెండు లేదా మూడో శతాబ్దం కాలానికి చెందినది. కాబట్టి ఈ విగ్రహం పురాతన వస్తువులు, ఆర్ట్ ట్రెజర్ చట్టం-1972 పరిధిలోకి వస్తుంది’ అని అమృత్‌సర్‌కి చెందిన రాహుల్ నంగరే అనే కస్టమ్స్ అధికారి చెప్పారు.