Psyllium Husk | మధుమేహం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించకపోతే గుండె, కిడ్నీలు, కళ్ళు వంటి అవయవాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అందరికీ తెలిసిందే. మందులతోపాటు సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు మధుమేహ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఇసబ్గోల్ (Psyllium Husk) మధుమేహ రోగులకు ఉపయోగకరమైన సహజ ఆహార పదార్థంగా గుర్తింపు పొందుతోంది. ఇసబ్‌గోల్‌లో అధికంగా ఉండే ద్రవీభవించే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బొహైడ్రేట్లు శరీరంలో నెమ్మదిగా శోషణ అవుతాయి. ఫలితంగా భోజనం అనంతరం రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇసబ్గోల్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (FBS), HbA1c స్థాయిలు తగ్గే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా వినియోగించుకునేలా చేయడంలో కూడా ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర నియంత్రణతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో కూడా ఇసబ్గోల్ ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇసబ్గోల్ తీసుకునే సరైన సమయం భోజనం ముందు అని సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినే ముందు 10 నుంచి 20 నిమిషాల ముందు తీసుకుంటే భోజనం తర్వాత గ్లూకోజ్ పెరుగుదలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు.
సాధారణంగా దీనిని రోజుకు 5 నుంచి 10 గ్రాముల వరకు, అంటే ఒక టేబుల్ స్పూన్ పరిమాణంలో తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే మొదట తక్కువ మోతాదుతో ప్రారంభించి క్రమంగా పెంచడం మంచిదని చెబుతున్నారు. ఇసబ్గోల్ నీటిని ఎక్కువగా శోషించుకునే గుణం కలిగి ఉండటంతో తప్పనిసరిగా తగినంత నీటితో తీసుకోవాలి. అలాగే ఇసబ్గోల్ తీసుకునేటప్పుడు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. కనీసం ఒకటి లేదా రెండు గ్లాసుల నీటితో కలిపి తీసుకోవాలి. లేకపోతే గొంతులో ఇరుక్కోవడం లేదా జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోజంతా ఎక్కువగా ద్రవాలు తీసుకోవడం కూడా ఎంతో అవసరం. ఫైబర్‌ను ఒక్కసారిగా ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు, కాబట్టి మోతాదును నెమ్మదిగా పెంచడం మంచిది. అలాగే ఇది కొన్ని మందుల శోషణను ఆలస్యం చేసే అవకాశం ఉన్నందున ఇతర మందులు తీసుకునే ముందు లేదా తర్వాత కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మింగడంలో ఇబ్బందులు ఉన్నవారు లేదా పేగు ఆడకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు ఇసబ్గోల్ వాడకూడదని హెచ్చరిస్తున్నారు. మధుమేహ రోగులు దీన్ని ప్రారంభించిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవడం అవసరం. అవసరమైతే వైద్యులు మందుల మోతాదును మార్చాల్సి రావచ్చని చెబుతున్నారు. ఇసబ్గోల్ మధుమేహ నియంత్రణకు సహాయపడే సహజ ఆహార పదార్థమే గానీ, ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన ఆహారం, వ్యాయామం, మందులు, వైద్యుల సూచనలతోపాటు దీన్ని ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని చెబుతున్నారు.