Mollywood | కొచ్చి/తిరువనంతపురం, ఆగస్టు 30: మలయాళ చిత్ర పరిశ్రమ మాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు, నటీమణులపై సహచర నటులు, చిత్రపరిశ్రమకు చెందిన వారే లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతాలు బయటపడటంతో పినరయి విజయన్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. చలనచిత్ర పరిశ్రమలో వేధింపులపై విచారణకు నియమించిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించినా, పలువురు నటీమణులు తమను వేధించిన నటులు, దర్శకులు, ఇతరుల పేర్లు వెల్లడించినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విపక్ష నేత వీడీ సతీశన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు విజయన్ ప్రభుత్వం రక్షణగా నిలుస్తున్నదని, ఇంత జరిగినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్ రాజీనామా చేయాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొచ్చి, కొల్లాంలో ప్రదర్శనలు నిర్వహించారు. కొల్లాంలో వారు ముకేశ్ ఇంటి ముందు ఆందోళన జరిపి, నినాదాలు చేశారు.
థీసిస్ అప్రూవల్ తప్పనిసరి కాదు
అది లేకున్నా మెడికల్ ఫైనల్ పీజీ పరీక్షలు రాయొచ్చు: ఎన్ఎంసీ
న్యూఢిల్లీ: పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లను తగ్గించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలు రాయడానికి థీసిస్ అప్రూవల్ తప్పనిసరి కాదని తెలిపింది. విద్యార్థులు తమ థీసిస్‌ను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వైద్య కళాశాల డీన్ ద్వారా సమర్పించాలని ఎన్ఎంసీ చెప్పింది. ఎన్ఎంసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ ఓజా వైద్య కాలేజీలకు ఈ మేరకు లేఖ రాశారు. థీసిస్‌కు హెచ్ఓడీ నుంచి ఆమోదం లభించలేదనే కారణంతో, విద్యార్థి పరీక్ష రాయకుండా నిరోధించకూడదని స్పష్టం చేశారు. థీసిస్‌ను ఆమోదించకుండా హెచ్ఓడీలు విద్యార్థులను వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డెహ్రాడూన్, పాటియాలా, భోపాల్ వంటి చోట్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి.