హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన బుద్ధవనం ప్రాజెక్టు పక్కనే ఉన్న చాకలిగుట్ట అద్భుత పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనున్నది. నాగార్జునసాగర్ నుంచి బోటులో నాగార్జునకొండకు వెళ్లేదారిలో కృష్ణా నదీజలాల మధ్యన ఈ గుట్ట ఉన్నది. మధ్యరాతి, కొత్తరాతి యుగాల్లో ఆదిమానవుల ఆవాసంగా విలసిల్లినట్టు ఆధారాలున్న ఈ ప్రదేశంలో నాగార్జునుడు నివసించినట్టు చరిత్ర చెప్తున్నది. సాగర్ బోటింగ్ పాయింట్ నుంచి 10 కి.మీ. దూరంలో ఉన్న చాకలిగుట్టకు వెళ్లాలంటే నదిలో దాదాపు గంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నాగార్జునగుట్ట, బుద్ధవనం ప్రాజెక్టుకు పక్కన 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ పర్యాటకశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
నాగార్జునగుట్ట నుంచి చాకలిగుట్టకు రోప్‌వే
రాష్ట్ర విభజనతో నాగార్జునగుట్ట ఏపీకి వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసుకొన్న ఈ ప్రాంతానికి నిత్యం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు వస్తుంటారు. ఇది చాకలిగుట్టకు కేవలం 600 మీటర్ల దూరంలోనే ఉన్నది. కానీ, అక్కడికి వచ్చే పర్యాటకులు బస చేయడానికి ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఉదయం వచ్చినవాళ్లు సాయంత్రం తిరిగి వెళ్లిపోవాల్సి వస్తున్నది. అందుకే ఈ రెండింటి మధ్య రోప్‌వే వేసి హోటళ్లు, కాటేజీలు, మెడిటేషన్, వెల్నెస్ (ప్రకృతి వైద్య) కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ పర్యాటకశాఖ భావిస్తున్నది. వీటితోపాటు రెండు ద్వీపాల మధ్య బోటింగ్, ట్రెక్కింగ్ వంటివి అందుబాటులోకి తెస్తే బుద్ధవనం ప్రాజెక్టుకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించవచ్చన్న ఆలోచనలో ఉన్నది. ఇందుకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన అధికారులు.. ఈ నిధులను పర్యాటకాభివృద్ధి శాఖ ద్వారా రుణంగా తీసుకోవాలా లేక అభివృద్ధి పనులను పీపీపీ పద్ధతిలో చేయాలా అనే అంశాలను పరిశీలిస్తున్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం..
నది మధ్యలో ఇలాంటి అద్భుతమైన చారిత్రక ప్రాంతం ఉండటం పర్యాటకాభివృద్ధికి అనుకూలమైన అంశం. పర్యాటకంగా అక్కడ ఏం చేయొచ్చన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎంను అక్కడికి తీసుకెళ్లి చూపిస్తాం. ఆయన అనుమతితో తదుపరి చర్యలు చేపడతాం. – శ్రీనివాస్‌గౌడ్,పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి
ప్రత్యేక ఆకర్షణ
బుద్ధవనం ప్రాజెక్టును చేపట్టిన తొలినాళ్లలోనే చాకలిగుట్టను అభివృద్ధి చేసుకొంటే బాగుంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. బుద్ధవనం, నాగార్జునగుట్టకు వచ్చే వాళ్లు ఉండటానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తే అద్భుతంగా ఉంటుంది. నది మధ్యలో ఒక టూరిజం స్పాట్ ఉంటే చాలా మంది ఆకర్షితులవుతారు.
– మల్లెపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్