తాంసి, మార్చి 11 : మహిళలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి సాధించాలని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ సుప్రజ, డాక్టర్ సుచరితాదేవి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం లచ్చంపూర్కు చెందిన 20 మంది ఎస్టీ మహిళలకు విలువ ఆధారిత పండ్ల ఉప ఉత్పత్తులపై మూడు రోజుల శిక్షణ ప్రారంభించారు. జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రంగంలో మహిళలు సంఘటితంగా రాణించడం అభినందనీయమన్నారు. ఈ రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. అందివచ్చిన ప్రతీ అవకావాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు వారికాళ్ల మీద వారే నిలవాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను అథితులు తిలకించారు. వివిధ రకాల పండ్లతో తయారు చేసిన జామ్‌లు, స్వాష్లు, చాక్లెట్లు, టమాటా కిచెప్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ప్రియాసుగంధి, నామ్ ప్రధాన శాస్త్రవేత్త రమేశ్ నాయక్, కేవీకే ప్రొగ్రాం కోఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్, ఏఆర్ఎస్ విభాగాధిపతి శ్రీధర్‌చౌహాన్, శాస్త్రవేత్తలు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.