ఎదులాపురం, మార్చి 25: ఆదిలాబాద్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పర్సోడి గ్రామానికి చెందిన టేకం నాగారావుపై 2016లో తాంసి పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు పదేండ్ల జైలు శిక్ష పడింది. దీంతో వరంగల్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడి నుంచి గతేడాది ఆదిలాబాద్ జైలుకు పంపించారు. టేకం నాగారావు (ఔట్ గ్యాంగ్) ఆరు నెలల నుంచి పశువులకు మేత వేయడం, చేనులో పనిచేయడం తదితర పనులు చేసేవాడు. గురువారం కూడా అవే పనులకు బయటకు వచ్చి పరారయ్యాడు. గుర్తించిన జైలు సిబ్బంది రాత్రి ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఖైదీ కోసం గాలిస్తున్నాయి. కాగా, సదరు ఖైదీ వచ్చే ఏడాది (సత్ప్రవర్తన ఆధారంగా) విడుదల కావాల్సి ఉన్నది.