Preity Zinta | బాలీవుడ్ నటి ప్రీతి జింతా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు హిందీతో పాటు తెలుగులోను నటించి అలరించింది. పలువురు సీనియర్ హీరోలతో కలిసి సందడి చేసింది. ఇప్పుడు సినిమాలు కాస్త తగ్గించిన ఈ భామ ఇప్పుడు బిజినెస్‌లతో బిజీ అయింది. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింతా ఐపీఎల్లో హుషారుగా ఉంటుంది. తన జట్టు మ్యాచులు ఉంటే చాలు.. మైదానంలో ఆమె వాలిపోతుంది. విజయాలు, పరాభవాలకు అతీతంగా జట్టు ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ తెగ సందడి చేస్తుంటుంది. పంజాబ్ టీమ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర టీమ్ ఫ్యాన్స్ కూడా ప్రీతిని ఎంతో ఇష్టపడుతుంటారు. ప్రీతి జింతా సైనిక కుటుంబాల పట్ల తన బాధ్యతను చాటుకొని అందరి మనసులు గెలుచుకుంది.
ప్రీతి సౌత్ వెస్ట్రన్ కమాండ్‌లోని ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA)కి రూ. 1.10 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా అందజేశారు. జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్, ప్రాంతీయ అధ్యక్షుడు శప్తా శక్తి, ఆర్మీ కుటుంబాలు హాజరైన సందర్భంగా ఈ విరాళం అందజేయడం జరిగింది. వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారట. సైనికుల త్యాగాలకి మనం వెలకట్టలేము. వారి కుటుంబాలకి మనం అండగా ఉందామని పిలుపునిచ్చింది ప్రీతి.
మన సాయుధ దళాల ధైర్యవంతులైన కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయడం మనం గౌరవంగా భావించాలి. అది మన బాధ్యత కూడా. మన సైనికులు చేసిన త్యాగాలను తిరిగి చెల్లించలేం. కానీ వారి కుటుంబాలకు మద్దతుగా నిలిచి, వారు ముందుకు సాగేందుకు అండగా ఉండవచ్చు అని ప్రీతి జింతా చెప్పుకొచ్చారు. ప్రీతి మంచి మనసుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక ప్రీతి ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహిచారంటూ మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై పిటిషన్ వేసింది ప్రీతి జింటా. కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి రూల్స్ పాటించకుండానే ఈ మీటింగ్ పెట్టారని తన పిటిషన్లో ఆమె పేర్కొంది.