e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News ప్రత్యామ్నాయం

ప్రత్యామ్నాయం

  • విత్తనాలు సిద్ధం!
  • యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యం
  • మెదక్‌ జిల్లాకు చేరుకున్న విత్తనాలు
  • పీఏసీఎస్‌, రైతు సేవా కేంద్రాల్లో విక్రయాలు
  • ఇతర పంటల సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు
  • మెదక్‌ జిల్లాలో 1,41,343 ఎకరాల్లో సాగు అంచనా
  • గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు

యాసంగిలో సాగు చేసే వరి, మొక్కజొన్న కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా వ్యవసాయశాఖ అధికారులు గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. యాసంగి పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించడంతో జిల్లా వ్యవసాయ అధికారులు ఈసీజన్‌లో అనువైన వంగడాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వరికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు, వేరుశనగ, పప్పు దినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలు జిల్లాలో పంపిణీ చేయనున్నారు. మెదక్‌ జిల్లాలో నేలల రకాల ఆధారంగా రైతులు సాగు చేసేందుకు పంటల ప్రణాళికలను అధికారులు రూపొందించారు. రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.

రైతులకు అందుబాటులో విత్తనాలు.. ఎరువులు

- Advertisement -

జిల్లాలో నేలల సారాన్ని బట్టి వరికి ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను గుర్తించి రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెసర, మినుములు, కందులు, వేరుశనగ, నువ్వులు వంటి పంటల విత్తనాలతో పాటు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, ఇనుము కూడా సిద్ధం చేశారు. మెదక్‌ జిల్లాలో యాసంగిలో పంటల సాగు అంచనా 1,43,343 ఎకరాలకు విత్తనాలను రైతులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా జిల్లాకు యాసంగిలో కావాల్సిన ఎరువులపై అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయో అంచనా వేసిన అధికారులు, ఎరువుల అవసరం ఎంత మేరకు ఉంటుందో గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. యూరియా 24,600 మెట్రిక్‌ టన్నులు, పొటాష్‌, ఎంవోపీ 4200 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 20:20:0:13 -12400 మెట్రిక్‌ టన్నులు అవసరమని తెలిపారు. మొత్తంగా వ్యవసాయశాఖ అధికారులు యాసంగికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేశారు.
గత యాసంగిలో మెదక్‌ జిల్లాలో 10వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మిగతా ఎకరాల్లో వేరుశనగ, పప్పులు, శనిగలు, మినుములు, పెసర, పొద్దుతిరుగుడుకు సంబంధించిన ఆరుతడి పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

పీఏసీఎస్‌, రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ..

యాసంగిలో విత్తనాలు, ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌), రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పలు ప్రాంతాల్లో వానకాలం పంటలు పూర్తి చేసుకున్న రైతులు, యాసంగి విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా రైతులు వరి పంటలే పండిస్తారు. కానీ, ఈ యాసంగిలో కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం కొనమనడంతో రాష్ట్ర ప్రభుత్వం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నది. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. రైతుకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు కింద ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు అందిస్తున్నారు. రైతు బీమా పథకం కింద రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం రోడెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సంఘటనలున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ముంగిటనే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నది.

ఆరుతడి పంటలతోనే అధిక లాభాలు..

యాసంగిలో ఆరుతడి పంటలతోనే అధిక లాభాలు వస్తాయి. యాసంగిలో వేరుశనగ, పప్పులు, శనగలు, మినుములు, పెసర, పొద్దు తిరుగుడుకు సంబంధించిన ఆరుతడి పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచిస్తున్నాం.

  • పరశురాంనాయక్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement