Prabhas | కృష్ణం రాజు నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ‘సలార్’ తర్వాత ‘కల్కి 2898 ఏ.డి’తో గొప్ప విజయం అందుకున్న ప్రభాస్, ఇప్పుడు మరో క్రేజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ లో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
‘ది రాజా సాబ్’తో పాటు పలు ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. వీటిలో హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ డ్రామా ‘ఫౌజి’, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’, అలాగే ‘కల్కి 2’, ‘సలార్ 2’ సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాల సంగతి పక్కనపెడితే, ప్రభాస్‌కు నలుగురు చెల్లెళ్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరు దివంగత నటుడు కృష్ణంరాజు కుమార్తెలు. ఈ నలుగురితో ప్రభాస్‌కి మంచి బాండింగ్ ఉంది. వీరిలో ప్రసీద ఇప్పటికే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, కుటుంబ నిర్మాణ సంస్థకు సంబంధించిన బాధ్యతలు చూసుకుంటోంది. అప్పుడప్పుడూ ప్రభాస్ సినిమాల ఈవెంట్లలోనూ ఆమె కనిపిస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రసీద తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘2025 – హాఫ్ వే దేర్’ అంటూ, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో జరిగిన మధురమైన సంఘటనల్ని గుర్తు చేస్తూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తల్లి మరియు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ప్రసీదపై, ఆమె పోస్ట్‌లపై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.ఇక ప్రభాస్ సినిమా అప్డేట్స్తో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలూ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.