భారత రాజకీయ చరిత్రను ఒకసారి నిశితంగా చూస్తే ఒక విషయం మళ్లీ మళ్లీ రుజువవుతుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎంతటి పరిపాలనా బలం, సంస్థాగత శక్తి, ఎన్నికల్లో ఎంత పెద్ద మెజారిటీ ఉన్నా, ఒక తరం యువత తన భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతే ఆ సర్కార్‌పై ఉన్న రాజకీయ విశ్వాసం క్రమంగా కరిగిపోవడం మొదలవుతుంది.
యువతలో మొదలయ్యే అసంతృప్తి మొదట వ్యక్తిగత సమస్యగా కనిపిస్తుంది. ఉద్యోగం రాకపోవడం, పరీక్ష వాయిదా పడటం, పేపర్ లీక్ కావడం, ఫీజు చెల్లించలేకపోవడం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం; ఇవన్నీ ఒక్కొక్కరి సమస్యలుగానే కనిపిస్తాయి. కానీ వేలు, లక్షల మంది యువత ఒకే అనుభవాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అది వ్యక్తిగత సమస్య కాదు. సామూహిక అసంతృప్తి. ఆ అసంతృప్తి ఆగ్రహంగా మారుతుంది. ఆగ్రహానికి సంఘటిత రూపం వస్తే ఉద్యమం పుడుతుంది. ఉద్యమానికి రాజకీయ దిశ దొరికితే అది అధికారాన్ని సైతం మార్చగల శక్తిగా మారుతుంది.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఈ మేధో ఉద్యమానికి ప్రధాన శిల్పిగా నిలిచారు. ఆయన తెలంగాణ వాదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా గణాంకాలు, చరిత్ర, వాస్తవాలు, ప్రజల అనుభవాలతో బలపరిచారు. నీటిపారుదలలో అసమానత, ఉద్యోగాల్లో అన్యాయం, వనరుల పంపిణీ, ప్రభుత్వ వ్యయం, ప్రాంతీయ అభివృద్ధి, పరిపాలనా వివక్ష వంటి అంశాలను ఆధారాలతో ప్రజల ముందుకు తెచ్చారు.
చంద్రగుప్త మౌర్యుడి నుంచి భగత్‌సింగ్ వరకు, వివేకానంద నుంచి గాంధీ వరకు, 1969 తెలంగాణ విద్యార్థి ఉద్యమం నుంచి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర సాధన పోరాటం వరకు, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం నుంచి అసోం విద్యార్థి ఉద్యమం వరకు, మండల్ ఆందోళన నుంచి అన్నాహజారే ఉద్యమం వరకు ఇదే రాజకీయ పాఠం కనిపిస్తుంది. ఇప్పుడు డిజిటల్ యుగంలో సీజేపీ వంటి కొత్త తరహా యువజన సమీకరణాలు అదే చరిత్రకు మరో కొత్త అధ్యాయాన్ని జోడించే ప్రయత్నం చేస్తున్నాయి.
హన్నా ఆరెండ్ చెప్పినట్టు, Power corresponds to the human ability not just to act but to act in concert. అంటే ఒక్కొక్కరిగా ఆవేదన వ్యక్తం చేయడం కాదు; కలిసి నిలబడినప్పుడు ఆ ఆవేదన రాజకీయ శక్తిగా మారుతుంది. అందుకే యువతను కేవలం రేపటి ఓటర్లుగా చూడటం పెద్ద పొరపాటు. వాళ్లు ఈ రోజే ప్రభుత్వాల రాజకీయ విశ్వసనీయతకు అద్దం పట్టే తరం. అసంతృప్తి ఉంటే సరిపోదు…
దానికి దిశ కావాలి: చంద్రగుప్త మౌర్యుడి కథ భారత రాజకీయ చరిత్రలో దీనికి తొలి గొప్ప ఉదాహరణ. చాణక్యుడి వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో యువ చంద్రగుప్తుడు చెదురుమదురుగా ఉన్న సైనిక, రాజకీయ శక్తులను ఒకే దిశలో నడిపించి, నందుల పాలనకు సవాల్ విసిరాడు. ఫలితంగా కేవలం ఒక రాజు స్థానంలో మరో రాజు రావడం కాదు. భారత ఉపఖండంలోనే తొలి గొప్ప కేంద్రీకృత సామ్రాజ్యాల్లో ఒకటైన మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. కోపం తిరుగుబాటును పుట్టించగలదు. కానీ వ్యూహం, నాయకత్వం, సంస్థాగత బలం కలిసినప్పుడే ఆ తిరుగుబాటు రాజకీయ మార్పుగా మారుతుంది. యువత శక్తిని ఇస్తుంది. నాయకత్వం దానికి దిశ చూపుతుంది. సంస్థ దానికి నిలకడ ఇస్తుంది. అందుకే చాణక్యనీతి ఇప్పటికీ వర్తిస్తుంది. అధికారాన్ని మార్చాలంటే ముందుగా అసంతృప్తిని సంఘటిత శక్తిగా మార్చాలి.
రాజకీయ మార్పు ఎప్పుడూ రాజు ఆస్థానాల్లోనో, పార్లమెంట్‌లోనే మొదలవదు. చాలాసార్లు అది మనసుల్లో మొదలవుతుంది. హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో చుట్టూ ఏర్పడిన యంగ్ బెంగాల్ ఉద్యమం దీనికి ఉదాహరణ. యువత ముందుగా పాత ఆలోచనలు, మూఢనమ్మకాలు, స్థిరపడిపోయిన సామాజిక అధికారాన్ని ప్రశ్నించింది. ఆ ప్రశ్నించే ధైర్యమే తర్వాత రాజకీయ చైతన్యానికి పునాదైంది.
స్వామి వివేకానంద ఈ చైతన్యాన్ని మరింత విస్తృతమైన జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కేవలం 39 ఏండ్లకే ఆయన కన్నుమూసినా, భారత యువతపై ఆయన ప్రభావం తరతరాలకు కొనసాగింది. Arise, awake, and stop not till the goal is reached, Strength is life, weakness is death అని ఆయన ఇచ్చిన పిలుపు కేవలం ఆధ్యాత్మిక సందేశం కాదు. బానిసత్వంలో ఉన్న సమాజానికి ముందుగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. మన భవిష్యత్తును మనమే మార్చగలమనే నమ్మకం లేకుండా ఏ జాతీ రాజకీయంగా ఎదుగదు. జాన్ డ్యూయీ చెప్పినట్టు, Democracy has to be born anew every generation. ప్రతి తరం ప్రజాస్వామ్యాన్ని తన అనుభవాలతో మళ్లీ నిర్వచించుకోవాలి. ఆ బాధ్యతలో యువతదే కీలక పాత్ర.
వివేకానంద యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపితే, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల తరం ఆ ఆత్మవిశ్వాసాన్ని రాజకీయ ధిక్కారంగా, త్యాగంగా, విప్లవ చైతన్యంగా మార్చింది. చంద్రశేఖర్ ఆజాద్, బటుకేశ్వర్ దత్, రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, జతిన్ దాస్ వంటి ఎందరో యువ విప్లవకారులు కూడా అదే తరానికి ప్రతీకలు. వాళ్లు కేవలం బ్రిటిష్ పాలనపై కోపంతో ఉన్న యువకులు కాదు. ఒక రాజకీయ తరానికి ప్రతినిధులు. భగత్‌సింగ్ పోరాటంతో పాటు విస్తృతంగా చదివారు, ఆలోచించారు. స్వాతంత్య్రం అంటే కేవలం బ్రిటిష్ పాలన పోవడం కాదని, సామ్రాజ్యవాదం, దోపిడీ, సామాజిక అసమానతల నుంచి కూడా విముక్తి రావాలని ఆయన భావించారు. అందుకే భగత్‌సింగ్ మాటలు ఇప్పటికీ అంతే పదునుగా వినిపిస్తాయి: Revolution is the inalienable right of mankind. Freedom is the imperishable birth right of all. 1931లో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీస్తే వారి ప్రభావం ముగుస్తుందని బ్రిటిష్ పాలకులు అనుకున్నారు. కానీ చరిత్ర వేరే తీర్పు చెప్పింది. వ్యక్తులను అణచవచ్చు. కానీ ఒక ఆలోచనను అంతం చేయలేం. హన్నా ఆరెండ్ చెప్పినట్టు, Power and violence are opposites. బలప్రయోగంతో భయపెట్టవచ్చు; కానీ ప్రజల మనసులో విశ్వాసాన్ని బలవంతంగా నింపలేం.
బ్రిటిష్ పాలనపై భారతదేశంలో కోపం అప్పటికే ఉన్నది. విప్లవకారులు ఉన్నారు. ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. కానీ మహాత్మాగాంధీ చేసిన అసాధారణమైన పని ఏమిటంటే, ఈ చెదురుమదురు ఆగ్రహాన్ని ఒక క్రమశిక్షణతో కూడిన జాతీయ ఉద్యమంగా మార్చడం. అహింస, సత్యాగ్రహం ద్వారా సాధారణ మనిషికి కూడా రాజకీయ పోరాటంలో భాగస్వామ్యమయ్యే మార్గం చూపించారు. బహిష్కరణ, సహాయ నిరాకరణ, పౌర అవిధేయత, పాదయాత్రలు, శాంతియుత నిరసనలు ఇవన్నీ ప్రజా ఉద్యమాల రాజకీయ ఆయుధాలుగా మారాయి. గాంధీ కోపాన్ని చంపలేదు.
ఆ కోపానికి క్రమశిక్షణ ఇచ్చారు. వ్యక్తిగత బాధను సామూహిక పోరాటంగా మార్చారు. త్యాగాన్ని నైతిక బలంగా మార్చారు. సాధారణ ప్రజలను రాజకీయ శక్తిగా మలిచారు. అందుకే ఆయన చెప్పిన In a gentle way, you can shake the world అనే మాట స్వాతంత్య్ర పోరాటానికే కాదు, తర్వాత దేశంలో జరిగిన అనేక తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా ఉద్యమాలకు కూడా వర్తిస్తుంది.
1969 జై తెలంగాణ ఉద్యమం స్వాతంత్య్రానంతరం జరిగిన అతి పెద్ద విద్యార్థి, యువజన ఉద్యమాల్లో ఒకటి. విద్యార్థులు ఉద్యమానికి గుండెకాయ గా నిలిచారు. ఉద్యోగాలు, నీళ్లు, వనరులు, అభివృద్ధి, ప్రాంతీయ హక్కులు, తెలంగాణకు జరిగిన అన్యా యం వంటి అంశాలు ఉద్యమానికి కేంద్రంగా మారా యి. విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు, త్యాగాలు చేశా రు, పోలీస్ అణచివేతను ఎదుర్కొన్నారు, కాల్పుల పాలై అసువులు బాశారు. తెలంగాణ కోసం ఒక భారీ ప్రజా భావోద్వేగాన్ని సృష్టించారు. కానీ తెలంగాణ మాత్రం రాలేదు. ఎందుకంటే ఉద్యమానికి ఆవేశం ఉన్నది కానీ ఆ ఆవేశాన్ని ఏండ్ల తరబడి ఒకే లక్ష్యంతో ముందుకు నడిపించే రాజకీయ నిర్మాణం లేదు.
1969 తర్వాత తెలంగాణ ఉద్యమం రాజకీయంగా కొంత బలహీనపడినా, తెలంగాణ భావన మాత్రం మాయమవ్వలేదు. దానికి కారణం మేధావులు, అధ్యాపకులు, రచయితలు, కవులు, పాత్రికేయులు, పరిశోధకులు, సాంస్కృతిక కార్యకర్తలు తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచడమే. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఈ మేధో ఉద్యమానికి ప్రధాన శిల్పిగా నిలిచారు. ఆయన తెలంగాణ వాదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా గణాంకాలు, చరిత్ర, వాస్తవాలు, ప్రజల అనుభవాలతో బలపరిచారు. నీటిపారుదలలో అసమానత, ఉద్యోగాల్లో అన్యాయం, వనరుల పంపిణీ, ప్రభుత్వ వ్యయం, ప్రాంతీయ అభివృద్ధి, పరిపాలనా వివక్ష వంటి అంశాలను ఆధారాలతో ప్రజల ముందుకు తెచ్చారు. అందుకే తెలంగాణ ఉద్యమం కొంతకాలం వీధుల్లో కనిపించకపోయినా, అది ప్రజల మనసుల్లో నుంచి పోలేదు.
కేసీఆర్ తెలంగాణ భావనను సృష్టించలేదు. తెలంగాణ ఆకాంక్ష దశాబ్దాలుగా ఉన్నది. కానీ 1969 ఉద్యమం ఎందుకు విఫలమైందో అర్థం చేసుకుని, ఆ ఉద్యమానికి లేని శాశ్వత రాజకీయ వేదికను నిర్మించడమే ఆయన చారిత్రక పాత్ర. తెలంగాణ సాధించాలంటే భావోద్వేగం ఒక్కటే సరిపోదని ఆయన అర్థం చేసుకున్నారు. మేధో బలం కావాలి, రాజకీయ సంస్థ కావాలి, విద్యార్థులు, యువతను కదిలించాలి, ఎన్నికల రాజకీయాలను ఉపయోగించాలి, నిరంతర ఉద్యమం కొనసాగాలి, ఢిల్లీపై రాజకీయ ఒత్తిడి పెంచాలి. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు ఆ పోరాటాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లింది. 1969లో కనిపించిన మేధో పునాది, రాజకీయ సంస్థ, యువత సమీకరణ, సామూహిక ఉద్యమం, ఎన్నికల ఒత్తిడి, జాతీయ రాజకీయ జోక్యం అనే దీర్ఘకాలిక వ్యూహం ఏర్పడింది. 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి మళ్లీ ఊపిరిపోసింది. విద్యార్థులు, యువత భారీగా ఉద్యమంలోకి వచ్చారు. చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందుకే 1969, 2014 మధ్య తేడా చాలా స్పష్టం. 1969లో యువత ఆగ్రహం ఉద్యమంగా మారింది. కేసీఆర్ నాయకత్వంలో అదే ఆగ్రహానికి రాజకీయ దిశ, సంస్థాగత బలం లభించి రాష్ట్ర సాధనగా మారింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
(తరువాయి భాగం రేపటి సంచికలో)
-పెండ్యాల మంగళాదేవి