హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 23(నమస్తే తెలంగాణ): టీజీఎస్పీడీసీఎల్ తొలిసారిగా నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్ 2026 విశేషంగా ఆకట్టుకుంటున్నది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శన వందేండ్ల విద్యుత్తు చరిత్ర, పరిణామక్రమాన్ని కండ్లకు కట్టినట్టుగా ఆవిష్కరిస్తున్నది. 1910 సంవత్సరం నాటి మెకానికల్ మీటర్ నుంచి నేటి స్మార్ట్‌మీటర్ వరకు మొత్తం 50 రకాల కరెంట్ మీటర్లు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
వినియోగదారుల ఇండ్లకు కరెంట్ రావడం వెనుక ఉన్న జనరేషన్ స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ఈహెచ్‌టీ స్టేషన్లు, సబ్స్టేషన్లు, లైన్లు, ఫీడర్లు, మీటర్ల ఇలా అన్ని అంశాలను ప్రతిబింబిస్తూ మినియేచర్ మోడళ్లను సంస్థ సీఎండీ జితేశ్ వీ పాటిల్ నేతృత్వంలో దక్షిణ డిస్కం అధికారులు స్వయంగా రూపొందించారు. సోమవారం వరకు జరుగుతున్న ఈ మూడురోజుల ప్రదర్శనకు ఆదివారం సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు.
విద్యార్థులకు జితేశ్ పాటిల్ స్వయంగా విద్యుత్ తయారీ, సరఫరా, పంపిణీ విధానాలను వివరించారు. ముఖ్యంగా దశాబ్దకాలంగా సంస్థలో ప్రవేశపెట్టిన ఐటీ ఆధారిత సేవలు, భద్రతాచర్యలతో పాటు ప్రత్యేకంగా అండర్‌గ్రౌండ్ కేబుల్స్, స్విచ్‌గేర్ పరికరాలు, మీటరింగ్ అండ్ బిల్లింగ్ విధానాలు, సోలార్ విద్యుత్తు, నెట్‌మీటరింగ్, ఈవీ చార్జింగ్ స్టేషన్లు తదితర అంశాలను ఈ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన 16 స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారు.