హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో హనీట్రాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పురుషులను టార్గెట్ చేస్తూ, పరిచయం పెంచుకుని రూ.లక్షలు వసూలు చేస్తున్న తాడితోటకు చెందిన నవీన, సత్యవతి, వెంకటలక్ష్మి, మరొక మహిళను అరెస్టు చేశారు. ఈ ముఠా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా ఉన్న పురుషులతో మాటలు కలిపి, వారి నుంచి ఫోన్ నంబర్లు సేకరించేవారు. ఆపై మాయమాటలతో తమ ఇండ్లకు రప్పించేవారు.
బాధితులు ఇంటికి రాగానే రహస్యంగా ఫొటోలు తీసి, బ్లాక్మెయిల్ చేసేవారు. ఎదురుతిరిగితే అత్యాచారం చేశారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించేవారు. కేసులు, సమాజంలో పరువు పోతుందనే భయంతో బాధితులు రాజీకి వచ్చి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించేవారు. బాధితుల నుంచి ఒక నెలలో రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు.