Potatoes | మనం ఆహారంగా తీసుకునే దుంప జాతి కూరగాయలల్లో ఆలుగడ్డలు కూడా ఒకటి. ఇవి మనకు చాలా తక్కువ ధరలో విరివిగా లభిస్తూ ఉంటాయి. వీటితో మనం కూర, పులుసు, వేపుడు వంటి వాటిని చేసి తీసుకుంటూ ఉంటాం. ఆలుగడ్డలతో చేసే చిప్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు ఈ చిప్స్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఆలుగడ్డల్లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయని వీటిని వేయించి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని వీటికి చాలా మంది దూరంగా ఉంటారు. కానీ ఆలుగడ్డల్లో కార్బొహైడ్రేట్స్ తో పాటు మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆలుగడ్డలను వేయించడానికి బదులుగా ఉడికించి లేదా బేక్ చేసి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందగలమని అంటున్నారు.
ఆలుగడ్డల్లో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఆలుగడ్డలను తీసుకోవడం వల్ల కండరాలు, నరాల పనితీరు పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆలుగడ్డల్లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆలుగడ్డల్లో ఉండే కార్బొహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడానికి బదులుగా ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఆటలు ఎక్కువగా ఆడేవారు తక్షణ శక్తి కోసం ఉడికించిన ఆలుగడ్డలను తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని చెబుతున్నారు.
ఆలుగడ్డలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరగడంతో పాటు రక్తనాళాలు కుచించుకుపోవడం కూడా తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఆలుగడ్డలు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. దీంతో జీర్ణ సంబంధిత ఇన్సెక్షన్ లు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎరుపు, పసుపు, ఊదా రంగు వంటి ఆలుగడ్డల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊదారంగు ఆలుగడ్డల్లో బెర్రీలకు సమానమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని తెలియజేస్తున్నారు. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నశింపజేసి మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని కాపాడడంలో ఆలుగడ్డలు మనకు ఎంతో సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఆలుగడ్డలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన శక్తి కూడా లభిస్తుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. వ్యాయామం చేసిన తరువాత కండరాలు వాటి గ్లైకోజన్ స్థాయిలను తిరిగి నిలుపుకోవడం చాలా అవసరం. ఆలుగడ్డలను తీసుకోవడం వల్ల కండరాలు వాటి గ్లైకోజన్ స్థాయిలను తిరిగి పొందడంతో పాటు చెమట ద్వారా శరీరం కోల్పోయిన మినరల్స్ కూడా తిరిగి అందుతాయి. ఈ విధంగా ఆలుగడ్డలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని ఉడికించి తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ ప్రయోజనాలను పొందగలుగుతాము. వీటిని నూనెలో వేయించి ఉప్పు, కారం వేసి చిప్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.